Best Web Hosting Provider In India 2024
Guntur Kaaram Ticket Price: గుంటూరు కారం మూవీకి తొలి రోజు తొలి షో నుంచే నెగటివ్ లేదంటే మిక్స్డ్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలోనూ మరీ ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలను తగ్గించాలన్న నిర్ణయం తీసుకుంది మూవీ టీమ్. నిజానికి పది రోజుల పాటు టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఉంది.
ట్రెండింగ్ వార్తలు
కానీ సినిమాకు వస్తున్న మిశ్రమ స్పందన నేపథ్యంలో గురువారం (జనవరి 18) నుంచే టికెట్ల ధరలను తగ్గించాలని గుంటూరు కారం ప్రొడ్యూసర్స్ నిర్ణయించారు. కొన్నిచోట్ల శుక్రవారం నుంచి టికెట్ల ధరలను తగ్గించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరల తగ్గింపు ఉంటుంది. గత శుక్రవారం (జనవరి 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
కలెక్షన్లపై ప్రభావం
గుంటూరు కారం మూవీ టికెట్ల ధరలు నైజాం ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉండటం కూడా బాక్సాఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపినట్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ రావడంతో న్యూట్రల్ ప్రేక్షకులు ఈ సినిమాను కాదని హనుమాన్ వంటి సినిమాల వైపు చూస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని టికెట్ల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
నిజానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రిలీజ్ అయిన రోజు నుంచి 10 రోజుల వరకు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చారు. ఏపీలో టికెట్ రేట్ పై రూ.50 మాత్రమే పెంచడంతో అది పెద్ద భారంగా కనిపించడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం మల్టీప్లెక్స్ లలో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.65 పెంచడంతో ప్రేక్షకులపై భారం మరీ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు పండగ హాలీడేస్ కూడా అయిపోయాయి. సంక్రాంతి మూడు రోజులూ ఎలాంటి సినిమాకైనా ఓ రేంజ్ కలెక్షన్లు ఉంటాయి. బుధవారం (జనవరి 17) నుంచి క్రమంగా ఈ కలెక్షన్లు పడిపోతుంటాయి. నిజానికి సోమవారం నుంచే టికెట్ల ధరలు తగ్గించి ఉంటే మరింత ప్రయోజనం ఉండేది.
గుంటూరు కారం ఐదు రోజుల కలెక్షన్లు ఇవీ
ఇప్పుడు టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి తొలి ఐదు రోజులు కలిపి గుంటూరు కారం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్లుగా ఉన్నాయి. అయితే మూవీ టీమ్ చెబుతున్నది మాత్రం సుమారు రూ.200 కోట్ల వరకూ ఉంది. ఇక ఇండియాలో రూ.100 కోట్లకు చేరువవుతోంది.
గ్రాస్ కలెక్షన్స్ పరంగా గుంటూరు కారం వంద కోట్ల క్లబ్‌ను ఈపాటికే దాటేసింది. కానీ, గుంటూరు కారం సినిమాకు సోమవారం అంటే నాలుగో రోజున రూ. 14.1 కోట్లు వచ్చాయి. కానీ, ఐదో రోజైన మంగళవారం మాత్రం రూ. 11.50 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. అంటే, నాలుగో రోజుతో పోలిస్తే ఐదో రోజుకి గుంటూరు కారం కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. మహేశ్ బాబు సినిమాకు తొలి రోజు ఇండియాలో రూ. 41.3 కోట్లతో భారీ ఓపెనింగ్స్ రాగా తర్వాతి రోజు రూ. 13.55 కోట్లకు కలెక్షన్స్ పడిపోయాయి.