Best Web Hosting Provider In India 2024
Vja Ambedkar Statue: దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. నగరం మధ్య స్వరాజ్య మైదానంగా పిలిచే పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌లో ఏపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన 210 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ట్రెండింగ్ వార్తలు
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా దాదాపు లక్షమందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం నిలువనుంది. 85 అడుగల పీఠంపై నిర్మించిన విగ్రహం మొత్తం 210 అడుగుల ఎత్తున నగరం నలుదిక్కులా కనిపించనుంది. దేశంలోనే ఎత్తైన అంబేడ్కర్ విగ్రహంగా నిలువనుంది.
విజయవాడకు ప్రత్యేక గుర్తింపు
అంబేడ్కర్ విగ్రహంతో ఇకపై బెజవాడకు ప్రత్యేక గుర్తింపు లభించ నుంది. ‘సామాజిక న్యాయ మహా శిల్పం’గా అంబేడ్కర్ స్మృతి వనాన్ని సందర్శనీయ స్థలంగా తీర్చిదిద్దారు. భావితరాలకు అంబేడ్కర్ ఆదర్శాలు, ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాస్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీని కోసం 18ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదలాయించారు. స్మృతి వనం నిర్మాణాన్ని AP ఇండస్ట్రీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు.
హైదరాబాద్‌కు చెందిన KPC ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైన్లను తయారు చేసింది. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి రూ.404.35 కోట్లకు చేరింది.
విగ్రహ నిర్మాణం జరిగే ప్రదేశం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని దృష్టిలో ఉంచుకుని, నగరం మధ్యలో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం చేపట్టారు. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు నిర్మించారు.
85 అడుగుల ఎత్తులో నిర్మించిన రెండంతస్తుల కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పరిగణిస్తారు.
ఎన్నో సౌకర్యాలు….
స్మృతి వనంలో DR BR అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్ వేస్‌తో డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది.
విగ్రహాన్ని గత ఏడాది ఏప్రిల్ 14 నాటికి ఆవిష్కరించాలనే ఉద్దేశ్యంతో 2021 డిసెంబర్ 21న ప్రాజెక్టును ప్రారంభించారు. విగ్రహం మొత్తం పూర్తిగా భారత దేశంలోనే తయారు చేశారు.
విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్‌తో మీద కాంస్యంతో తయారు చేసిన క్లాడింగ్‌తో తయారు చేశారు. దీనిన పూర్తిగా భారతదేశంలోనే తయారు చేశారు. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు.
కాలచక్ర మండపం డిజైన్…
బౌద్ధ వాస్తుశిల్పం యొక్క కాలచక్ర మహా మండలంగా పీఠాన్ని రూపుదిద్దారు. విగ్రహం పీఠం G+2 ఐసోసెల్స్ ట్రాపెజియం ఆకారంలో ఆర్‌సిసి ఫ్రేమ్డ్ నిర్మాణంగా చేపట్టారు.
భవనం పునాదులు విగ్రహ బరువు తట్టుకునేలా పైల్ ఫౌండేషన్‌తో 30మీటర్ల పైల్స్‌పై నిర్మించారు. షీర్ వాల్ గోడలు మరియు 50డిగ్రీల వంపుతో వంపు తిరిగిన RCC స్లాబ్‌లు, బీమ్‌లతో మొత్తం 539 పైల్స్ మీద ప్రధాన విగ్రహాన్ని నిలిపారు.
విగ్రహ పీఠం ఉన్న పెడెస్టల్ బిల్డింగ్ మొత్తాన్ని రాజస్థాన్ నుండి తెచ్చిన పింక్ ఇసుకరాయితో తాపడం చేశారు.
స్మారక చిహ్నం ముందుభాగంలో 6 నీటి కొలనుల్ని ఏర్పాటు చేవారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
DR.B.R అంబేద్కర్ అనుభవ కేంద్రం
కాలచక్ర మహా మండప భవనం లోపల విగ్రహం క్రింద అంబేడ్కర్ జీవిత విశేషాలు తెలిపే కేంద్రం అభివృద్ధి చేశారు. మ్యూజియం కోసం ప్రదర్శనలు సిద్ధం చేశారు. మల్టీ-లేయర్డ్ గ్రాఫిక్స్, లేయర్డ్ గ్రాఫిక్స్ విత్ ఎంబెడెడ్ డిస్‌ప్లేలతో చూసే వారిని కట్టి పడేయనుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కథతో లోతుగా కనెక్ట్ అవ్వడానికి, స్ఫూర్తిని పొందగలిగేలా తీర్చదిద్దారు.
రెండేళ్ల కృషికి ఫలితం…
భవనం బేస్‌మెంట్‌తో పాటు జి+1తో నిర్మించారు. 6340 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి 2000 మంది సభ్యులు కూర్చునేలా రూపొందించారు. స్మృతి వనంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా వాహనాల పార్కింగ్‌కు వీలు కల్పించారు. ఒకేసారి 95 నాలుగు చక్రాల వాహనాలు, 84 ద్విచక్ర వాహనాలు నిలుపుకోవచ్చు.
500-600 మంది కార్మికులు ప్రాజెక్టు సైట్‌లో నిరంతరం పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు రెండేళ్ల పాటు పనిచేశారు. అంబేడ్కర్ స్మృతి వనం కోసం వినియోగించిన వస్తువులన్నీ దేశంలోనే తయారు చేశారు.
చరిత్రలో నిలిచిపోతుందన్న సిఎం జగన్…
అంబరాన్ని తాకేలా విజయవాడలోఏర్పాటు చేసుకుంటున్న రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.అంబేడ్కర్ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’ (సామాజిక న్యాయ మహా శిల్పం) అని అభివర్ణించారు.
మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చటానికి, సంఘ సంస్కరణలకు, పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఆ మహా శిల్పం నిరంతరం స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
19వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తొలుత వర్చువల్‌గా విగ్రహావిష్కరణ చేస్తారని ప్రకటించినా చివరి నిమషంలో సిఎం హాజరావుతారని ప్రకటించారు.
టాపిక్