Best Web Hosting Provider In India 2024
Sharmila And Jagan: వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకల్లో షర్మిల-జగన్‌ల మధ్య ఉన్న దూరం స్పష్టంగా కనిపించింది. మేనల్లుడి నిశ్చితార్థానికి సతీసమేతంగా వెళ్లిన జగన్మోహన్ రెడ్డి గోల్కొండ రిసార్ట్స్‌లో కేవలం రెండున్నర మూడు నిమిషాలు మాత్రమే గడిపారు.
ట్రెండింగ్ వార్తలు
వేదికపైకి వెళుతున్నపుడు ఎదురొచ్చిన కేవీపీ సతీమణిని ఆలింగనం చేసుకున్న జగన్ ఆ తర్వాత సోదరి షర్మిల, తల్లి విజయమ్మను పలకరించారు. మేనల్లుడు రాజారెడ్డిని ఆలింగనం హత్తుకుని అభినందనలు చెప్పారు. కాబోయే వధువు ప్రియను ఆశీర్వదించారు. ఇదంతా రెండున్నర మూడు నిమిషాల వ్యవధిలో ముగిసిపోయింది.
హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్టులో గురువారం సాయంత్రం వేడుక జరిగింది. తెలంగాణ మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. వేడుకలో పాల్గొనేందుకు సాయంత్రం 8 గంటల సమయంలో సిఎం జగన్ రిసార్టుకు చేరుకున్నారు. సతీమణి భారతితో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. జగన్ వెంట చిన్నాన్న వైవీసుబ్బారెడ్డితో పాటు వ్యక్తిగత సిబ్బంది కనిపించారు.
వధువరుల్ని ఆశీర్వదించడానికి ముందు సోదరి షర్మిలను జగన్‌కు దగ్గరకు తీసుకున్నారు. తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ సమయంలో షర్మిల ముఖంలో పెద్దగా స్పందన కనిపించలేదు. నూతన జంటకు బోకేఇస్తుండగా గ్రూపు ఫొటో తీసే సమయంలో షర్మిల దూరంగా ఉండటం గమనించి దగ్గరకు రావాలని పిలిచారు. ఫొటో కోసం దగ్గరకు రావాలని ఒకటి రెండు సార్లు పిలిచిన తర్వాత షర్మిల ఆమె భర్త అనిల్ విజయమ్మ పక్కన నిలబడ్డారు.
పవన్, భట్టి విక్రమార్కలతో ఉల్లాసంగా…
సోదరుడు జగన్మోహన్ రెడ్డితో అంటిముట్టనట్టుగా వ్యవహరించిన షర్మిల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఉల్లాసంగా కనిపించారు. నవ్వుతూ పవన్‌ను స్వాగతించారు. తెలంగాణ డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఇతర మంత్రులు వచ్చినపుడు కూడా షర్మిల వారిని సంతోషంగా ఆహ్వానిస్తూ కనిపించారు.
కుటుంబ వివాదాలతో పాటు మరో నలుగైదు రోజుల్లో ఏపీలో రాజకీయంగా సోదరుడితో ప్రత్యక్షంగా తలపడాల్సి ఉండటంతో షర్మిల.. అన్న రాకను మనస్ఫూర్తిగా స్వాగతించ లేకపోయినట్టు తెలుస్తోంది.
షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, సినీ నటులు మోహన్‌బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత శైలజానాథ్, జేడీ శీలం, ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, జి.వివేక్ తదితరులు హాజరయ్యారు.
టాపిక్