Best Web Hosting Provider In India 2024
Nayanthara Sorry On Annapoorani Controversy: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాలతో అలరించిన నయనతార తెలుగులోనూ స్టార్ హీరోయిన్ రేంజ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే జవాన్ మూవీతో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది నయన్. ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తున్న నయనతార ఇటీవల వివాదాలపాలైంది.
ట్రెండింగ్ వార్తలు
నయనతార తన కెరీర్‌లో 75వ చిత్రంగా వచ్చింది అన్నపూర్ణి (Annapoorani). ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సమయం నుంచే వివాదాలు మూటగట్టుకుంది. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత నెల రోజులకు అంటే డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అన్నపూర్ణి సినిమాను స్ట్రీమింగ్ చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ ప్రాంతాల నుంచి చూసిన ప్రేక్షకులు అన్నపూర్ణి సినిమాపై అభ్యంతరం తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీన్సు ఉన్నాయంటూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ, నిర్మాతలు, జీ స్టూడియో సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తాకిడికి తట్టుకోలేక నెట్ ఫ్లిక్స్ సంస్థ తన వేదిక నుంచి అన్నపూర్ణి సినిమాను తొలగించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాను తొలగించడాన్ని డైరెక్టర్ నీలేష్ కృష్ణ ఖండించారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజాగా అన్నపూర్ణి మూవీ వివాదంపై (Annapoorani Controversy) నయనతార స్పందించింది. ఎవరైనా తమ సినిమా వల్ల హర్ట్ అయితే సారీ చెబుతూ ఇంగ్లీష్, హిందీ, తమిళంలో ఒక లేఖను పోస్ట్ చేసింది. జై శ్రీరామ్ అంటూ లేఖను ప్రారంభించిన నయనతార.. “అన్నపూర్ణి మూవీ వల్ల జరుగుతున్న పరిణామాలపై బరువైన గుండెతో లేఖ రాస్తున్నాను. అన్నపూర్ణి కేవలం సినిమాలాగా కాకుండా ఎలాంటి పరిస్థితులో అయినా ధైర్యాన్ని వీడకూడదనే స్ఫూర్తిని నింపడం కోసం చేసిన ప్రయత్నం” అని తెలిపింది.
“అన్నపూర్ణి చిత్రంలో ప్రతి ఒక్కరి జీవితానికి అద్దంపట్టి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంకల్పం ఉంటే ఎలాంటి కష్టాలను అయినా దాటవచ్చని చూపించాలని అనుకున్నాం. ఒక పాజిటివ్ సందేశం ఇచ్చే క్రమంలో తెలియకుండానే కొంతమందిని హర్ట్ చేసి ఉండొచ్చు. సెన్సార్ పూర్తయి థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీ నుంచి తొలగిస్తారని మేము అస్సలు ఊహించలేదు” అని నయనతార పేర్కొంది.
“నా టీమ్ గానీ, నేను కానీ ఎవరి సెంటిమెంట్‌ను కావాలని బాధపెట్టాలని అనుకోలేదు. జరిగిన సంఘటన తాలుకు లోతు ఎంతో ఉందని మాకు అర్థం అవుతోంది.దేవుడిని బలంగా నమ్మి దేశవ్యాప్తంగా ఆలయాలకు తిరిగే వ్యక్తిగా నేను ఇలాంటి పని కావాలని ఎప్పుడూ చేయను. ఎవరి ఫీలింగ్స్ అయితే హర్ట్ అయ్యాయో వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. స్ఫూర్తిని ఇవ్వాలన్నదే అన్నపూర్ణి లక్ష్యం. బాధపెట్టాలని కాదు” అని నయనతార సారీ చెప్పింది.
ఇదిలా ఉంటే అన్నపూర్ణి సినిమాలో నయనతార చెఫ్ కావాలని కలలు కనే ఒక బ్రాహ్మణ యువతిగా చేసింది. చెఫ్ అంటే మాంసాహారం కూడా వండాల్సి వస్తుంది. అలాంటిది ఒక బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారాన్ని వండాలనుకోవడం, అది వండేందుకు కన్ఫ్యూజన్‌లో ఉన్న ఆమెకు ఓ ముస్లిం క్యారెక్టర్ రాముడు మాంసం తినడం గురించి మాట్లాడటం, బిర్యానీ చేయడానికి ముందు హిందూ పాత్ర నమాజ్ చేయడం వంటి సీన్స్‌పై తీవ్రమైన విమర్శలు తలెత్తాయి.