Best Web Hosting Provider In India 2024
SSMB29 Big Update: గుంటూరు కారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు అభిమానులకు అతని నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. మహేష్, రాజమౌళి సినిమా కథ రాయడం పూర్తయిందని ఆయన వెల్లడించారు. తాజాగా టీవీ9 తెలుగు ఛానెల్ తో మాట్లాడుతూ ఈ మూవీ అప్డేట్ ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు నటించనున్నాడన్న వార్త రాగానే ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఈ మూవీ ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. మొత్తానికి ఇప్పటికి ఈ సినిమా కథ రాయడం పూర్తయినట్లు రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇక మూవీ షూటింగ్ ఎప్పుడో రాజమౌళి వెల్లడించాల్సి ఉంది.
ఎస్ఎస్ఎంబీ29 కథ రెడీ
మహేష్ బాబు కెరీర్లో ఇది 29వ సినిమా కానుంది. అతనితో సినిమా చేయనున్నట్లు 2022, సెప్టెంబర్ లో రాజమౌళి అధికారికంగా అనౌన్స్ చేశాడు. మొత్తానికి సుమారు ఏడాదిన్నర తర్వాత ఈ సినిమా కథ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ నెక్ట్స్ ప్రాజెక్టులు ఏంటని అడిగిన సందర్భంలో ఈ విషయం చెప్పారు.
“ప్రస్తుతం మహేష్ బాబుతో కథ అయిపోయింది. రాజమౌళితో చేస్తున్నాము” అని ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ తర్వాత అటు రాజమౌళిగానీ, ఇటు విజయేంద్ర ప్రసాద్ గానీ మరో సినిమా చేయలేదు. మహేష్ సినిమాతోపాటు హిందీలో అజయ్ దేవ్‌గన్ మూవీ కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్క్రిప్ట్ పని పూర్తి కావడంతో ఇక షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. పాన్ ఇండియా కాదు ఈసారి పాన్ వరల్డ్ లెవల్లో తన సినిమా తీయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే భారీ స్థాయిలో వస్తున్న సినిమా కావడం, అందులోనూ తన ప్రతి సినిమాకు రాజమౌళి తీసుకునే సమయాన్ని బట్టి చూస్తే ఎస్ఎస్ఎంబీ 29 ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవు.
ఇండియానా జోన్స్ స్ఫూర్తితో..
మహేష్, రాజమౌళి సినిమా కథ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. యాక్షన్ అడ్వెంచర్ అనే జానర్ తెలిసినా.. ప్రధానంగా మూవీ ప్లాట్ పై ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే గతంలో ఒకసారి విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండియానా జోన్స్ స్టోరీలైన్ తో మూవీ రానున్నట్లు తెలిపారు. భారత మూలాలతో ఉండబోయే జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ లాంటి మూవీ అని రాజమౌళి కూడా టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్పాడు.
ప్రస్తుతం మహేష్ బాబు తన గుంటూరు కారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ.. తొలి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. సినిమాకు తొలి షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినా.. వసూళ్లలో మాత్రం వెనక్కి తగ్గలేదు.