Best Web Hosting Provider In India 2024
Child Rights and You(CRY): ఈ నెల 24వ తేదీన జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలికల పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడలేదని ప్రముఖ భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY చైల్డ్ రైట్స్ అండ్ యు అభిప్రాయపడింది. బాలికల విద్య, ఆరోగ్య, రక్షణ విషయాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నాయని తెలిపింది.
ట్రెండింగ్ వార్తలు
బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించి వివిధ ప్రభుత్వ నివేదికలను విశ్లేషిస్తూ CRY విడుదల చేసిన ఒక స్థాయీ నివేదిక ప్రకారం…. రాష్ట్రంలో పాఠశాలల్లో బాలికల నమోదు ప్రాధమిక విద్య స్థాయిలో అత్యధికంగా ఉండగా.. సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో బాలికల నమోదు చాలా తక్కువగా ఉంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (UDISE+) 2021-22 గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధమిక విద్య స్థాయిలో 80% కన్నా ఎక్కువ మంది బాలికలు పాఠశాలల్లో చేరగా, సెకండరీ స్థాయిలో 49%, హయ్యర్ సెకండరీ స్థాయిలో 37% శాతం మంది బాలికలు మాత్రమే బడుల్లో చేరినట్లు తెలుస్తోంది.
ఆందోళనకరంగా బాలికల భద్రత..
బాలికల మీద అత్యాచారం, లైంగికదాడుల నేరాల వార్తలు పతాక శీర్షికల్లో కనిపిస్తుండగా వారి భద్రత, రక్షణ అంశం కూడా ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద 1,000 మందికి పైగా మైనర్ బాలికలు అత్యాచార బాధితులుగాను, మరో 1,000 మంది మైనర్ బాలికలు లైంగిక దాడులు, వేధింపుల బాధితులుగాను నమోదైంది. అలాగే బాలికల ఆరోగ్యం, పోషకాహారం విషయంలోనూ పరిస్థితులు ఇదే రీతిలో ఆందోళన కలిగిస్తోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 (NFHS-5 2019-21) నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15-19 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో 65% మందికి పైగా రక్తహీనత ఉన్నట్లు అంచనా వేశారు. అదే నివేదిక ప్రకారం, 20-24 సంవత్సరాల వయస్సు గల మహిళలలో 29% మందికి 18 సంవత్సరాల వయసు కంటే ముందే వివాహం జరిగినట్లు అంచనా. అంటే వివాహం, మాతృత్వం అనే భారాలను మోయటానికి మానసికంగానూ శారీరకంగానూ సిద్ధం కాకముందే వారికి పెళ్లిళ్లు జరిగాయి.
బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై CRY విడుదల చేసిన నివేదిక NCRB 2022, UDISE+ 2021-22, NFHS-5 (2019-2021) వంటి వివిధ ప్రభుత్వ నివేదికలను లోతుగా పరిశీలిస్తూ, బాలికల హక్కలకు సంబంధించి విద్య, రక్షణ, ఆరోగ్యం-పోషకాహారం అనే మూడు ప్రధాన అంశాలపైన దృష్టి సారించింది. ఈ నివేదికలో గుర్తించిన అంశాల గురించి CRY సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ వివరిస్తూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో బాలికల పరిస్థితులను మెరుగుపరచడానికి వరుస ప్రభుత్వాలు క్రియాశీలంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మరింత కేంద్రీకృతంగా, సమిష్టిగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు చాటుతున్నాయి’’ అని చెప్పారు.
‘‘బాలికలపై నేరాలను అరికట్టడం, విద్యకు సంబంధించి ఉన్నత తరగతులలో వారి నమోదును పెంచడం, బాల్య వివాహాలను నిరోధించడంతో పాటు వారి మొత్తం ఆరోగ్యం, పోషకాహార పరిస్థితులను మరింతగా మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఈ సమాచారం బలంగా చాటుతోంది’’ అని పేర్కొన్నారు.
సమిష్టిగా కృషి అవసరం – జాన్ రాబర్ట్స్
ఈ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం, పౌర సమాజం సమిష్టిగా కృషి చేయాలని జాన్ రాబర్ట్స్ పిలుపునిచ్చారు. “బాలికలు కేంద్ర బిందువుగా గల విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆ కోణంలో వ్యూహాత్మకంగా వనరులను కేటాయించడం ద్వారా, వాటిని సమర్థవంతంగా అమలయ్యేలా చేయడం ద్వారా ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి. నిర్దిష్ట లక్ష్యాలతో క్షేత్రస్థాయిలో పనిచేయడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు, సామాజిక నాయకులు, వ్యక్తులు ఈ కృషిని మరింతగా బలోపేతం చేయవచ్చు. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి సమిష్టిగా కృషి చేయడం ద్వారా, మనం మరింత సమానత్వంతో కూడిన సంపన్న సమాజానికి పునాది వేయగలం” అని ఆయన పేర్కొన్నారు.
పౌర సమాజం పోషించాల్సిన పాత్రకు అనుగుణంగా ‘బాలికలను సాధికారం చేద్దాం’ (Walk to EmpowHER!) అనే పిలుపుతో CRY ఈ నెల 21వ తేదీ ఆవివారం నాడు విశాఖపట్నం లోని ఆర్.కె. బీచ్‌లో అవగాహన నడకను నిర్వహిస్తోంది. విశాఖపట్నంతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు – నాలుగు దక్షిణాది రాష్ట్రాల నగరాల్లో CRY అదే రోజున ఈ తరహా అవగాహన నడకలను చేపడుతోంది.
CRY చేపట్టిన ఈ ‘Walk to EmpowHER!’ లక్ష్యం గురించి వివరిస్తూ….. ‘‘ఇది కేవలం నడక మాత్రమే కాదు; భారతదేశ బాలికలకు మరింత ఆశాజనకమైన భవిష్యత్తును రూపొందించే దిశగా ఇది ఒక శక్తివంతమైన ప్రయాణం. మన బాలికలకు ఉజ్వలమైన, మరింత సురక్షితమైన భవిష్యత్తు కోసం గొంతెత్తే, శ్రమించే సామాజిక కార్యకర్తలు, ప్రభావశీలురను ఈ నడకలు ఒక వేదిక మీదకు తెస్తాయి’’ అని జాన్ రాబర్ట్స్ చెప్పారు.
“ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్‌లోని బాలికల సాధికారతకు CRY తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, రక్షణకు సంబంధించిన అంతరాలను రూపుమాపడానికి మా కృషిని కొనసాగిస్తాం. ఈ విషయంలో CRY బహుముఖ విధానాన్ని అనుసరిస్తోంది. విద్యా కార్యక్రమాలను బలోపేతం చేయడం, బాల్య వివాహాలను నిరోధించడం, బాల కార్మికతను నిర్మూలించడం మా లక్ష్యం. స్థానిక సమాజాలు, ప్రభుత్వ వ్యవస్థలతో సమన్వయం, సహకారం ద్వారా.. ప్రతి ఒక్క బాలికా తన ఆకాంక్షలను నెరవేర్చుకోగల భవిష్యత్తును సృష్టించాలని మేము కోరుకుంటున్నాము” అని జాన్ రాబర్ట్స్ ఉద్ఘాటించారు.
సంబంధిత కథనం
టాపిక్