Best Web Hosting Provider In India 2024
BRS MLA Padi Kaushik Reddy: గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ కొందరు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకోగా.. చివరకు పంచాయతీ భవనాన్ని ప్రారంభించకుండానే ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కన్నూరులో నూతనంగా గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. దానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన కన్నూరు గ్రామానికి వచ్చారు. అనంతరం పంచాయతీ భవనాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం చెప్పారు.
ట్రెండింగ్ వార్తలు
ప్రోటోకాల్ పాటించడం లేదని నిలదీత
ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ప్రారంభోత్సవం చేయకూడదని కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేపడితే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఇన్చార్జ్ మంత్రి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా చేపడుతారంటూ నిలదీశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు జిల్లా మంత్రి గానీ, ఇంచార్జ్ మంత్రిగానీ హాజరు కాకుండా పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
వెనుదిరిగిన కౌశిక్ రెడ్డి
సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగ తగలడం తో కౌశిక్ రెడ్డి కొద్దిసేపు సైలెంట్ గా ఉండిపోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ జిల్లా మంత్రులు గాని, ఇన్చార్జి మంత్రులకు గాని ఎలాంటి సమాచారం లేకుండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం సరికాదన్నారు. కన్నూరు తో పాటు శంభునిపల్లి గ్రామంలో శంకుస్థాపన చేయడం కోసం ఏర్పాటు చేయడం సబబు కాదని, ఇలాంటి చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి కంగు తిన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలకు ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరించాలంటూ కోరారు. అభివృద్ధి పనులకు అడ్డుతగిలేలా కాంగ్రెస్ లీడర్లు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. కాజిపేట ఏసీపీ డేవిడ్ రాజ్, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నచ్చజెప్పగా పంచాయతీ భవనాన్ని ప్రారంభం చేయకుండానే ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు.
రిపోర్టింగ్ – (హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్