Best Web Hosting Provider In India 2024
Animal OTT Release: బాలీవుడ్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత డిసెంబర్ 1న రిలీజ్ కాగా.. సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీలోని విపరీతమైన హింస, బోల్డ్ సీన్లపై విమర్శలు వచ్చినా.. కమర్షియల్‍గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులో కేసు నడుస్తుండడం ఇందుకు కారణంగా ఉంది. ఆ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
యానిమల్ సినిమాను నిర్మించిన టీ-సిరీస్ (సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్), ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍పై ఈ మూవీకి సహ నిర్మాతగా ఉన్న సినీ1 స్టూడియోస్ కోర్టులో కేసు వేసింది. తమకు టీ-సిరీస్ బకాయిలను చెల్లించలేదని, అందుకే యానిమల్ ఓటీటీ రిలీజ్‍ను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది సినీ1 స్టూడియోస్. ఈ పిటిషన్‍ను విచారించిన న్యాయస్థానం నేడు టీ-సిరీస్‍తో పాటు నెట్‍ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.
నోటీసులు అందడంతో టీ-సిరీస్, నెట్‍ఫ్లిక్స్.. కోర్టుకు అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
సినిమా లాభాల్లో తమకు ఒక్క రూపాయి కూడా టీ-సిరీస్ (సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్) చెల్లించలేదని సినీ1 స్టూడియోస్ (ప్లైన్‍టిఫ్) కోర్టుకు తెలిపింది. రూ.2.6 కోట్లు ఇచ్చినట్టు టీ-సిరీస్ తరఫున న్యాయవాది తెలిపినా.. అందుకు తగిన ఆధారాలను చూపలేదు.
ఓటీటీ రిలీజ్ ఆలస్యం అవుతుందా?
యానిమల్ సినిమాను జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భావించింది. అయితే, ఇప్పుడు ఈ విషయం కోర్టు విచారణపై ఆధారపడి ఉంది. జనవరి 22వ తేదీన ఈ కేసు ఓ కొలిక్కి రాకపోతే యానిమల్ ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సద్దుమణిగితే అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
యానిమల్ చిత్రంలో రణ్‍బీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటించారు. బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి డిమ్రి, బబ్లూ వృథ్విరాజ్, శక్తికపూర్ కీలకపాత్రలు చేశారు. టీ సిరీస్, భద్రకాళి పిక్చల్స్, సినీ1 స్టూడియోస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‍తో రూపొందించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
యానిమల్ సినిమాలోని మితిమీరిన హింస సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని చాలా మంది విమర్శించారు. మహిళలపై దాడిని కూడా ప్రోత్సహించేలా ఈ మూవీ ఉందని ఆరోపణలు వచ్చాయి. కొందరు ప్రముఖులు కూడా ఈ చిత్రంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, సినిమాను సినిమాలా చూడాలంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. మూవీలోని క్రాఫ్ట్స్ గురించి మాట్లాడకుండా.. కొన్ని అంశాల గురించే విమర్శిచడం తగదని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు. యానిమల్ చిత్రానికి సీక్వెల్‍గా ‘యానిమల్ పార్క్’ కూడా వస్తుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.