Bhadrachalam Temple : పేరుకే దక్షిణ అయోధ్య, ప్రభుత్వాల నిర్లక్ష్యపు నీడ!

Best Web Hosting Provider In India 2024

Bhadrachalam Sita Rama Temple : భక్తులు దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అనాదిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు మొన్నటి వరకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రామయ్య గుడి అభివృద్ధి గురించి అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా నాడు రామదాసు నిర్మించిన ఆలయం నేటికీ ఎలాంటి ఉన్నతికి నోచుకోకుండా అలాగే ఉంది. బీఆర్ఎస్ హయాంలో ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలుకు ఫండ్స్ ఇస్తామని ప్రకటించారే తప్ప పైసా రిలీజ్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆలయాన్ని ప్రసాద్ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద చేర్చింది. ఈ స్కీమ్ కింద చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయోధ్యలో రామమందిరం నిర్మాణం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని రామ భక్తులు కోరుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

మూలన పడిన మాస్టర్ ప్లాన్

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని యాదాద్రి తరహాలో డెవలప్ చేస్తామని ప్రకటించింది. 2016లో ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయించింది. ఏటా బడ్జెట్ లో నిధులు ఇస్తామని మాటిచ్చింది. ఆలయ అభివృద్ధి, వసతుల కల్పన కోసం ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనందసాయి ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ తయారు చేయించింది. ఆలయం చుట్టూ రెండు ప్రాకారాలు, వేయికాళ్ల మండపం, గోదావరి పుష్కరిణి, 105 అడుగుల రామస్థూపం తదితర నిర్మాణాలకు 65 ఎకరాలు అవసరమని అంచనా వేశారు. రూ.400 కోట్లు ఖర్చయినా భద్రాచలం దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించిన అప్పటి సీఎం కేసీఆర్ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకొచ్చే సంప్రదాయాన్ని కూడా నీరుగార్చారు. బీఆర్ఎస్ హయాంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేయలేదు. ప్రకటనలు తప్ప ఫండ్స్ ఇవ్వకపోవడంతో మాస్టర్ ప్లాన్ మూలన పడింది.

“ప్రసాద్” పనులు నత్తనడకన

నిత్యం రామ జపం చేసే కేంద్ర సర్కారు కూడా భద్రాచలం డెవలప్మెంట్ పై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రసాద్” పనులకు 2022 డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శంకుస్థాపన చేశారు. తొలిదశలో రూ.41.38 కోట్లు మంజూరు చేయగా.. భద్రాచలంలోని మిథిలా స్టేడియం పక్కన భవన నిర్మాణాలు చేపట్టారు. టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్ కు అప్పగించిన పనులు నత్త నడకన సాగుతున్నాయి. పర్ణశాల, ఇతర చోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. రామాలయంలో, స్టేడియంలో రూఫ్ వర్క్స్ కూడా మొదలు పెట్టలేదు. టెండర్లో పేర్కొన్న మేరకు పనులు 2024 మే నాటికి పూర్తికావాలి. కానీ పనులు జరుగుతున్న తీరు చూస్తే ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై అనాదిగా చిన్న చూపే చూస్తున్నాయి.

 

రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

WhatsApp channel
 

టాపిక్

 
 
BhadrachalamAyodhya Ram MandirTelangana NewsGovernment Of TelanganaTrending TelanganaTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024