Best Web Hosting Provider In India 2024
90s Web Series Aditya Haasan: ‘నైంటీస్ (90s) – ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్ విపరీతంగా పాపులర్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో గత నెల స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సిరీస్‍కు భారీగా ఆదరణ లభిస్తోంది. 1990ల నాటి మధ్య తరగతి కుటుంబం ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ 90s సిరీస్ చాలా మందికి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. అతడి టేకింగ్‍పై ప్రశంసలు వస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
90s వెబ్ సిరీస్‍తో ప్రతిభను నిరూపించుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్.. మూవీని కూడా డైరెక్టర్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. నితిన్ హీరోగా ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం బయటికి వచ్చింది. నితిన్ – ఆదిత్య కాంబోలో చిత్రం దాదాపు ఖరారైంది.
నితిన్ – ఆదిత్య హాసన్ కాంబినేషన్‍లో మూవీని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ నిర్మించనుంది. నితిన్ కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ హౌసే శ్రేష్ఠ్ మూవీస్. దీంతో సొంత బ్యానర్‌లోనే ఆదిత్యతో మూవీ చేసేందుకు నితిన్ రెడీ అయ్యారు. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
భీష్మ సినిమా తర్వాత నితిన్‍కు ఆ రేంజ్‍లో హిట్ దక్కడం లేదు. నాలుగేళ్లుగా సరైన విజయం లేక సతమతమవుతున్నారు. రంగ్‍దే, మాచర్ల నియోజకవర్గం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయాయి. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ కూడా ఫ్లాఫ్ అయింది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‍హుడ్ సినిమా చేస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్ – వెంకీ కాంబో రిపీట్ అవుతుండటంతో రాబిన్‍హుడ్‍పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ టైటిల్ రివీల్ అయింది. తదుపరి ఆదిత్య హాసన్‍తో నితిన్ మూవీ చేయడం దాదాపు ఖరారైంది.
90s వెబ్ సిరీస్ గురించి..
90s – ఏ మిడిల్‍క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ జనవరి 5వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. సీనియర్ నటుడు శివాజీ, వాసుకీ ఆనంద్, మౌళి తనూజ్ ప్రశాంత్, రోహన్, వసంతిక ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. 1990ల్లో మధ్య తరగతి కుటుంబ పరిస్థితులను, మనస్తత్వాలను, అప్పటి స్థితిగతులను 90s సిరీస్‍లో అద్భుతంగా చూపించారు దర్శకుడు ఆదిత్య హాసన్. కామెడీ, ఎమోషన్స్, బంధాలను ఆదిత్య ఈ సిరీస్‍లో చూపించిన తీరు, అతడి టేకింగ్ అందరినీ ఆకట్టుకుంది.
చాలా మందికి రిలేట్ అయ్యేలా జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉండటంతో 90s వెబ్ సిరీస్ చాలా పాపులర్ అయింది. చాలా మంది ప్రముఖులు కూడా ఈ సిరీస్‍ను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. 90s వెబ్ సిరీస్‍కు సురేశ్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా బాగా ప్లస్ అయింది. ఈ సిరీస్‍ను నవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం నిర్మించారు.