Best Web Hosting Provider In India 2024
Bhadradri Kothagudem Crime News: వృద్ధ దంపతులను నమ్మించి దారి దోపిడీకి పాల్పడిన ఉదంతం ఇది. లిఫ్ట్ ఇస్తామని చెప్పి వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని బొమ్మ బొరుసు ఆట పేరుతో వారి వద్ద ఉన్న సుమారు రూ.2.55 లక్షల సొత్తును దుండగులు దారి దోపిడీ చేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వాంకుడోత్ కేతానాయక్, బాలి దంపతులు వైరాలోని లైన్స్ ఐ కేర్ హాస్పిటలో కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. తిరిగి వారి ఊరికి వెళ్లేందుకు వైరా బస్టాండుకు చేరుకున్నారు. వీరిని ఫాలో అవుతూ వచ్చిన దుండగులు వైరా బస్టాండులో మాట కలిపి ఉచితంగా కారులో తీసుకెళ్తామని ఎక్కించుకు న్నారు. ఆ కారులో అప్పటికే మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. వైరా మండలం స్టేజి పినపాక గ్రామం దాటగానే కారులో ఉన్న వారు ముందస్తు పథకం ప్రకారం “బొమ్మ బొరుసు” ఆట ప్రారంభించారు. కేతానాయక్ ను నమ్మించి తొలుత రూ.50, ఆ తర్వాత రూ.5 వేలు తీసుకున్నారు. ఆడుతున్న క్రమంలోనే ఆటలో మీ డబ్బులు పోయాయని తెలిపారు. అనంతరం వృద్ధురాలు బాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసుపై వారి కన్ను పడింది. ఆ గొలుసు పెట్టి ఆట ఆడితే లక్ష రూపాయలు వస్తాయని నమ్మించారు. దీంతో బాలి గొలుసు తీసి ఇచ్చింది. ఆ తర్వాత ఆటలో గొలుసు కూడా పోయిందని నమ్మబలికారు. వెంటనే కారులోని ఒక వ్యక్తి ఆ డబ్బులు, నాలుగు తులాల బంగారు గొలుసును తీసుకొని మార్గం మధ్యలోని తల్లాడ గ్రామ శివారులో దిగి పోయాడు.
చాలా తెలివిగా తమను మోసం చేశారని గ్రహించిన ఆ దంపతులు కారు తల్లాడ దాటిన తర్వాత అగంతకులతో గొడవపడ్డారు. దీంతో కారులో ఉన్న మిగిలిన అగంతకులు ఆ వృద్ధ దంపతులను తల్లాడలోని కల్లూరు రోడ్డులో కారులోంచి బయటికి నెట్టి పరారయ్యారు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరా సీఐ సాగర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గొలుసు విలువ సుమారు రెండున్నర లక్షలు ఉంటుందని అంచనా. వైరా ఏసీపీ రెహమాన్ ఆదేశాల మేరకు వైరా సీఐ ఎన్.సాగర్ ఆధ్వర్యంలో వైరా, తల్లాడ ఎస్ఐలు మేడా ప్రసాద్, కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఖమ్మం.
టాపిక్