Best Web Hosting Provider In India 2024
Janhvi Kapoor as Sita: దంగల్ మూవీ ఫేమ్ నితేష్ తివారీ తీస్తున్న రామాయణం మూవీలో ఎవరు నటిస్తున్నారన్నదానిపై సస్పెన్స్ వీడటం లేదు. పైగా రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. తాజాగా ఈ మూవీలో సీత పాత్రను జాన్వీ కపూర్ పోషించబోతోందని సమాచారం. ఇన్నాళ్లూ ఈ పాత్రలో సాయి పల్లవి నటిస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్ వార్తలు
రణ్‌బీర్ రామాయణంలో సీత మారింది
రణ్‌బీర్ కపూర్ ఈ రామాయణంలో రాముడిగా కనిపించనున్నాడన్నది మాత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగతా పాత్రలపై మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. రోజుకో పేరు తెరపైకి వస్తోంది. అయితే సీతగా సాయి పల్లవి నటిస్తోందన్న వార్త చాలా మందిలో ఆసక్తి రేపింది. ఈ పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందంటూ ఆమెను సీతగా ఊహించుకుంటూ ఏఐ ద్వారా ఫొటోలు కూడా క్రియేట్ చేశారు.
కానీ ఇప్పుడు ఈ పాత్రను దేవర మూవీ ఫిమేల్ లీడ్ జాన్వీ దక్కించుకుందన్న వార్తలు వస్తుండటం విశేషం. నిజానికి ఈ రామాయణం మూవీ గురించి తొలిసారి వార్తలు వచ్చినప్పుడు నిజజీవిత భార్యాభర్తలు రణ్‌బీర్, ఆలియానే రాముడు, సీతగా నటిస్తారని అన్నారు. ఆ తర్వాత సీత పాత్ర కోసం దీపికా పదుకోన్ కూడా సంప్రదించారనీ తెలిసింది. చివరికి సాయి పల్లవిని ఫైనల్ చేశారని కొన్ని రోజుల కిందట తేలింది.
జాన్వీ కపూరే ఫైనలా?
తాజాగా ఫస్ట్‌పోస్ట్ లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. నితేష్ తివారీ రామాయణంలో జాన్వీ కపూర్ నటించబోతోందట. ఈ పాత్రకు ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని డైరెక్టర్ భావిస్తున్నట్లు ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఫిబ్రవరిలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోందనీ తాజా సమాచారం. కానీ చివరి నిమిషంలో పాత్రల విషయంలో జరుగుతున్న ఈ మార్పులు షూటింగ్ ను ఆలస్యం చేయనున్నాయి.
ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ యశ్ నటించనున్నాడనీ చాలా రోజులుగా వార్తలు వస్తున్నా.. దానిపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఇక కుంభకర్ణుడి పాత్ర కోసం బాబీ డియోల్, హనుమంతుడి పాత్ర కోసం సన్నీ డియోల్ లను అనుకుంటున్నట్లు కూడా తెలిసింది. విభీషణుడి పాత్రను తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించబోతున్నట్లూ ఈ మధ్యే వార్తలు వచ్చాయి.
రామాయణం మూవీ, అందులో నటించబోయే వారిపై ఎన్ని వార్తలు వస్తున్నా.. మూవీ టీమ్ నుంచి మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. డైరెక్టర్ నితేష్ తివారీ దీనిపై నోరు విప్పడం లేదు. సుమారు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో మూడు భాగాలుగా ఈ రామాయణం తెరకెక్కనుందన్నది మాత్రం స్పష్టమైంది. ఇందులో మొదటి పార్ట్ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అటు రణ్‌బీర్ కపూర్ యానిమల్ తర్వాత ఈ మధ్యే సంజయ్ లీలా భన్సాలీతో కలిసి లవ్ అండ్ వార్ మూవీకి అంగీకరించాడు.
టాపిక్