Best Web Hosting Provider In India 2024
Cyber Crime : అమాయకులను వలలో వేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తూ రకరకాల మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. అలాంటి మోసమే హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా సాగుతుంది. డిజిటల్ సేవలు అందిస్తమంటూ….అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కిలాడీ కేటుగాళ్లను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రైల్వే, విమాన సేవలతో పాటు 300 రకాల సర్వీస్ లను అందిస్తామని ఆన్లైన్ లో ప్రకటనలు ఇచ్చారు. నిజమేనని నమ్మిన బాధితులు వారిని సంప్రదించడంతో వారికి నిందితులు ముఠా ఒక ఐడీ క్రియేట్ చేసుకోవాలని, ఐడీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో వ్యక్తి రూ.1800 లు ఇవ్వాల్సి ఉంటుందని కస్టమర్లకు మాయ మాటలు చెప్పారు. ఆ తర్వాత కూడా కేవైసీ వెరిఫికేషన్ అని పలు రకాల పేర్లతో వేల రూపాయలు దండుకున్నారు. కాగా ఓ బాధితుడు ఫిర్యాదుతో డిజిటల్ సర్వీసుల బాగోతం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ట్రెండింగ్ వార్తలు
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్, జైపూర్ ప్రధాన కేంద్రంగా ఐజీఎస్ డిజిటల్ సెంటర్ లిమిటెడ్ సంస్థ పేరుతో అక్రమ దందాను నిందితులు కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనూ కేంద్రం ఏర్పాటు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బేగంపేట వైట్ హౌస్ భవనంలో నిందితులు కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సీఈఓ ప్రతీక్, హెచ్ఆర్ స్వర్ణలత, శ్రావణ్ లాల్ శర్మాలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
రూ.200 కోట్లు వసూల్ చేసి -బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ
హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రక రకాల మోసలతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతుంటే….. ఇప్పుడు ఎంతో నమ్మిన మనుషులు కూడా నిలువుగా ముంచేస్తున్నారు. కడుపు కట్టుకొని రూపాయి రూపాయి పోగేసుకున్న అమాయకులకు కుచ్చుటోపి పెట్టి బోర్డు తిప్పేసింది ఓ చిట్ ఫండ్ కంపెనీ. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఏరియాలో ఒక చిట్ ఫండ్ కంపెనీ సుమారు రూ.200 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేయడం సామాన్యులకు ఆందోళనకు గురిచేస్తుంది. మాదాపూర్ ప్రాంతంలో సమత మూర్తి చిట్ ఫండ్ కంపెనీ ఈ భారీ మోసానికి పాల్పడింది. చిట్టీల పేరుతో సామాన్యుల నుంచి ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేసి చివరికి బోర్డు తిప్పేసింది. కాగా ఇది జరిగి రెండు నెలలు జరుగుతుండగా…… ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు చేతిలో మోసపోయిన వందలాది మంది బాధితులు రెండు నెలల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా….పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన సీపీ మాదాపూర్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీపీ ఆదేశాలతో రంగాల్లోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చిట్ ఫండ్ కంపెనీతో సంబంధం ఉన్న శ్రీనివాస్, రాకేష్, గణేష్ జ్యోతి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. శ్రీనివాస్ ,రాకేష్ లను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం
టాపిక్