Best Web Hosting Provider In India 2024
Naa Sami Ranga movie on OTT: నా సామిరంగ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍పై అధికారిక ప్రకటన వచ్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం నెల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ విలేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
నా సామిరంగ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే సరిగ్గా వారంలో ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (ఫిబ్రవరి 10) అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా త్వరలో అంటూ ఊరిస్తూ వచ్చిన ఆ ప్లాట్‍ఫామ్ ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్‍ను ఫిబ్రవరి 17కు ఫిక్స్ చేసింది.
మరో వారంలో కింగ్ వచ్చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డిస్నీ+ హాట్‍స్టార్. “మనం కింగ్‍న చూసేందుకు మరొక్క వారమే ఉంది. నా సామిరంగ సినిమా ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్” అని ట్వీట్ చేసింది. మాస్ అవతార్‌లో నాగార్జున స్టైలిష్‍గా మీసం దువ్వుతున్న వీడియోను పోస్ట్ చేసింది.
నా సామిరంగ గురించి..
నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాలను తెచ్చిపెట్టింది. బాక్సాఫీస్ వద్ద హిట్‍గా నిలిచింది. ఈ చిత్రానికి సుమారు రూ.45కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సంక్రాంతి పండుగకు సూటయ్యేలా విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం వచ్చింది.
మలయాళ మూవీ పరింజు మరియం జోస్‍కు రీమేక్ అయినా.. నా సామిరంగ చిత్రంలో చాలా మార్పులు చేశారు దర్శకుడు విజయ్ బిన్నీ. తెలుగుకు తగ్గట్టే ఛేంజెస్ చేసి ప్రేక్షకులను మెప్పించడంలో విజయవంతం అయ్యాడు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
నా సామిరంగ చిత్రంలో నాగార్జునకు జోడీగా అషికా రంగనాథ్, అల్లరి నరేశ్ సరసన మిర్నా మీనన్, రాజ్ తరుణ్‍కు జోడీగా రుక్సార్ థిల్లాన్ నటించారు. షబ్బీర్ కల్లరకల్, నాజర్, రవివర్మ, రావు రమేశ్, మధుసూదన్ రావు కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ మాటలను అందించారు.
నా సామిరంగ కథ..
నా సామిరంగ సినిమా 1980ల కాలంలో అంబాజీపేట గ్రామంలో జరుగుతుంది. ఈ గ్రామ అధ్యక్షుడు పెద్దయ్య (నాజర్).. కిష్టయ్య (నాగార్జున)కు చిన్నతనం నుంచే సాయం చేస్తుంటాడు. మహాలక్ష్మి అలియాజ్ ‘వరాలు’ (అషిక రంగనాథ్).. కిష్టయ్య ప్రేమించుకుంటారు. కొన్ని కారణాల వల్ల వారు విడిపోవాల్సి వస్తుంది. కిష్టయ్యతో పాటు అతడి తమ్ముడు అంజి (అల్లరి నరేశ్)ని చంపాలని పెద్దయ్య కుమారుడు దాసు (షబీర్) ప్రయత్నిస్తుంటాడు. ఈ గొడవలకు కారణమేంటి.. కిష్టయ్య, వరాలు ప్రేమ గెలిచిందా.. భాస్కర్ (రాజ్ తరుణ్) ఎవరు అనేది నా సామిరంగ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
టాపిక్