Best Web Hosting Provider In India 2024
Rajamouli About Murali Mohan MMM50 Event: తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీ మోహన్. ఆయన నటుడిగా అరంగేట్రం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం (ఫిబ్రవరి 10) హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మురళీమోహన్ 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకదిగ్గజం రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఆయన సినిమాలకు తీసుకెళ్లేవారు
“నా వయసు 50 ఏళ్లు. మురళీ మోహన్ గారు సినిమాల్లోకి అడుగు పెట్టి 50 ఏళ్లు. ఇక ఆయన గురించి నేను ఏం చేప్తాను. చిన్నప్పుడు నేను ఎన్టీఆర్‌కు వీరాభిమానిని. ఆయన సినిమాలు అన్నీ చూసేది. కానీ, మా అమ్మ, పెద్దమ్మతోపాటు మా కుటుంబంలోని ఆడవాళ్లు చాలా మంది మురళీ మోహన్ గారి అభిమానులు. వాళ్లంతా నన్ను మురళీ మోహన్ గారి సినిమాలకు తీసుకుని వెళ్లేవాళ్లు. ఎన్టీఆర్ చిత్రాలను ఒక్కసారి చూస్తే.. మురళీ మోహన్ గారి సినిమాలను రెండు, మూడు సార్లు చూసేవాడిని” అని రాజమౌళి అన్నారు.
23 సినిమాలు సక్సెస్
“మురళీ మోహన్ గారికి నా చిన్నప్పుడు మహిళల్లో ఎంతో ఫాలోయింగ్ ఉండేది. నిజానికి చిన్నప్పుడు ఆయన నాకు పెద్ద శత్రువు. మా వాళ్లు నన్ను ఎన్టీఆర్ సినిమాలను కాదని.. మురళీ మోహన్ మూవీస్‌కు తీసుకెళ్లే వాళ్లని బాగా కోపం. ఆయన గొప్పతనం నేను ఇండస్ట్రీలోకి వచ్చాకే తెలిసింది. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన గొప్పగా విజయం సాధించారు. 25 సినిమాలు తీస్తే వాటిలో 23 చిత్రాలు సక్సెస్ అయ్యాయి. అయినా, తనకు నచ్చినట్లు సినిమా నిర్మాణం జరగట్లేదని భావించి నిర్మాతగా తప్పుకున్నారు. ఆయన క్యారెక్టర్‌కు హ్యాట్సాఫ్” అని రాజమౌళి చెప్పుకొచ్చారు.
రాజమౌళి ప్రశంసలు
“చిరునవ్వుతో, మంచితనంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి మురళీ మోహన్ గారు నిదర్శనం. ఆయన ఇప్పటికీ అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు” అని దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే మురళీ మోహన్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, అశ్వనీదత్, మహాన్యూస్ వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు.
కారు బహుమతి
ఈ కార్యక్రమం సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించారు. పలు సినిమాల్లోని మురళీ మోహన్‌కు సంబంధించిన 50 ఫొటోలతో కూడిన ఫ్రేమ్‌ను ఆయనకు అందించి సత్కరించారు. అలాగే ఈ వేడుక సందర్భంగా 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావు గారికి మురళీమోహన్ ఒక కారును బహుమతిగా అందజేశారు.
హాజరైన ప్రముఖులు
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభ, జయచిత్ర, కవిత, ముప్పా వెంకటేశ్వర చౌదరి, అట్లూరి పూర్ణ చంద్రరావు, కృష్ణప్రసాద్, మాజీ మంత్రి, కామినేని శ్రీనివాసరావు, సీనియర్ నటుడు ప్రదీప్, శివకుమార్, నిహారిక, ఆదిత్య, రవి, జర్నలిస్ట్ ప్రభు, పొట్లూరి శ్రీనివాస్, కొల్లి రాము మరియు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.