Best Web Hosting Provider In India 2024
Zahirabad Loksabha: జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్లో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మరోసారి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా… మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు, ఎన్డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా బరిలో నిలచేందుకు సిద్ధమవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈసారి ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తన కుమారుడిని బరిలో దించేందుకు శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కామారెడ్డి జిల్లాలో ఉన్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కేవలం శ్రీనివాసరెడ్డి మాత్రమే గెలుపొందారు. స్వయంగా కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేసినా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో తనకున్న ఛరిష్మా, యువనేతగా భాస్కర్‌రెడ్డికి యూత్‌లో ఉన్న ఆదరణ నేపథ్యంలో తన కుమారుడికి ఈసారి అవకాశమిస్తే విజయం సాధిస్తారని శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారు. ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పైగా కేసీఆర్‌కు తనకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో టిక్కెట్టు నిరాకరించబోరనే నమ్ముతున్నారు.
మరోవైపు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ స్థానం నుంచి ఆయన రెండుసార్లు విజయం సాధించారు. కానీ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌షిండేకు, పాటిల్‌కు మధ్య దూరం, ప్రజలకు అందుబాటులో లేకపోవడం, అధిష్టానంతో కొంత దూరం పెరగడం పాటిల్‌కు వ్యతిరేకంగా మారాయి.
అయితే సామాజిక సమీకరణల నేపథ్యంలో మహారాష్ట్ర, కర్నాటకు సరిహద్దుగా ఉన్న ఈ పార్లమెంట్ నియోకవర్గం నుంచి తనకు అవకాశమిస్తనే మళ్లీ గెలిచే అవకాశముందని పాటిల్ వర్గం భావిస్తోంది. మరోవైపు జహీరాబాద్ లోక్‌సభ టిక్కెట్ కుమారుడికి ఇప్పించుకోవాలని మాజీ స్పీకర్ పోచారం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
కాంగ్రెస్ వేవ్‌లో నిలబడేనా?
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన నేపథ్యంలో రాష్ట్రంలో హస్తం పార్టీ హావా సాగుతోంది. పైగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్రమ మైనింగ్‌తో పాటు గత ప్రభుత్వ అవకతవకలపై విచారణ చేపడుతోంది.
ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీర్కూర్ ఇసుక క్వారీలో అక్రమాలపై ప్రతిసారీ పోచారం కుటుంబాన్ని ముఖ్యంగా భాస్కర్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఒకవేళ పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటే భాస్కర్‌రెడ్డికి టిక్కెట్టు ఇస్తారా అన్నది అనుమానంగా ఉంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటికీ గత హయంలో జరిగిన అక్రమాలు తవ్వుతోంది. ఎన్నికల సమయంలో ఈ అంశాలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంటే మొదటికే మోసం వస్తుందన్న టాక్ కూడా వినిపిస్తుంది.
ఒకవేళ బీబీ పాటిల్‌కు మూడోసారి అవకాశం ఇస్తే వ్యతిరేకత అంశం ముందుకు వచ్చే సమస్య ఉంది. దీంతో జహీరాబాద్ నుంచి ఎవరికి టిక్కెట్టు ఇస్తారా అన్నది ఆసక్తిగా ఉంది.
(రిపోర్టింగ్ మీసా భాస్కర్, నిజామాబాద్)
టాపిక్