Best Web Hosting Provider In India 2024
BRS Rajya Sabha Candidates 2024: రాజ్యసభ నామినేషన్ల (Rajya Sabha Elections 2024)గడువు రేపటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీకి(BRS Party) చెందిన బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర రిటైర్ అవుతున్న వారిలో ఉన్నారు. ఈ మూడు స్థాానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికయ్యే ఈ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ట్రెండింగ్ వార్తలు
ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా అధికార కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress) రెండు స్థానాలను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో రాజ్యసభ సభ్యుడు గెలవాలంటే కనీసం 39 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఓటేయాల్సి ఉంది. పోటీకి దించాలంటే కనీసం పది మంది ఎమ్మెల్యేలు ఆయన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల ప్రకారం చూస్తే…. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మూడు స్థానాలు ఖాళీగా ఉండగా అంతకన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్, సీపీఐ కలిపి 65 మంది సభ్యులు… ఇద్దరు అభ్యర్థులకు కేటాయిస్తే ఒకరికి 33, రెండో అభ్యర్థికి 32 ఓట్లు వస్తాయి. ఇక బీఆర్ఎస్ తరపున ఉన్న 39 మంది ఓటేస్తే వారికి ఒక సీటు ఖరారు అవుతుంది. ఈ లెక్కన వరుసగా అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటిస్తారు.
బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు…?
ఫిబ్రవరి 15వ తేదీతో రాజ్యసభ నామినేషన్ల(rajya sabha nominations 2024) దాఖలు గడవు పూర్తి కానుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే ఈ ఛాన్స్ ను దక్కించుకునేందుకు పలువురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మరోసారి వద్దిరాజు రవిచంద్ర అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆయనే కాకుండా… ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రావుల చంద్రశేఖరరెడ్డి రేసులో ఉన్నారు. ఇక మరో సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తుండగా… ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. కాసాని జ్ఞానేశ్వర్, దాసోజు శ్రవణ్ తో పాటు మరో ఒక్కరిద్దరి పేర్లను కూడా గులాబీ నాయకత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది.
గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. మిగిలిన రెండేళ్ల కాలానికి వద్దిరాజు రవిచంద్రకు ఉపఎన్నికలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కింది. ఫలితంగా ఆయన రెండేళ్లు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. అయితే మరోమారు తనకు అవకాశం ఇవ్వాలని వద్దిరాజు కోరుతున్నారని సమాచారం. బీసీ సామాజికవర్గానికి చెందటం కూడా వద్దిరాజుకు కలిసివచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతలు రేసులో ఉన్న నేపథ్యంలో…. గులాబీ బాస్ కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు ఇవాళ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
టాపిక్