Best Web Hosting Provider In India 2024
Ravi Teja Kick Re Release: రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్‌లో ఒకటిగా కిక్ మూవీ నిలిచింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ కామెడీ కథాంశంతో 2009లో రిలీజైన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మరోసారి కిక్ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. మార్చి 1న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రీ రిలీజ్ చేస్తోంది. కిక్ రీ రిలీజ్‌కు సంబంధించి భారీగా ప్రమోషన్స్‌ను కూడా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలాఖరున రీ రిలీజ్‌కు సంబంధించి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు చెబుతోన్నారు.
ట్రెండింగ్ వార్తలు
సలార్, హనుమాన్ తర్వాత…
ఇటీవల తెలుగులో రిలీజైన ప్రభాస్ సలార్, ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలకు నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ వ్యవహరించింది. ఈ రెండు సినిమాలు మైత్రీకి భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి. ఈ రెండు బ్లాక్‌బస్టర్స్ తర్వాత కిక్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది.
హల్వరాజ్‌గా బ్రహ్మానందం…
కిక్ సినిమాలో తన కిక్ కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధపడే యువకుడిగా రవితేజ మల్టీడైమెన్షన్ క్యారెక్టర్‌లో కనిపించాడు. అతడి కామెడీ టైమింగ్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ముఖ్యంగా రవితేజ, బ్రహ్మానందం ట్రాక్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. హల్వారాజ్ పాత్రలో బ్రహ్మానందం కామెడీతో అదరగొట్టాడు. సినిమా విజయంలో బ్రహ్మానందం కీలకంగా నిలిచాడు.
ఎన్టీఆర్‌తో అనుకొని…
కిక్ సినిమాలో రవితేజకు జోడీగా ఇలియానా నటించింది. కోలీవుడ్ నటుడు శామ్ కీలక పాత్ర పోషించాడు. తమన్ పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. హీరోగా రవితేజకు, దర్శకుడిగా సురేందర్‌రెడ్డికి కిక్ మూవీ స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. కిక్ మూవీని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేశాడు. తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా రీమేకైంది. తొలుత ఈ మూవీని ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాడు సురేందర్‌రెడ్డి. కానీ తన ఇమేజ్‌కు సరిపోతుందో లేదోననే అనుమానంతో ఎన్టీఆర్ కిక్ మూవీని రిజెక్ట్ చేశాడు. దాంతో రవితేజతో సురేందర్‌రెడ్డి ఈ సినిమా చేశాడు. కిక్‌కు సీక్వెల్‌గా కిక్ 2 కూడా వచ్చింది. కానీ ఫస్ట్ పార్ట్‌లోని మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయింది. డిజాస్టర్‌గా మిగిలింది.
వెంకీ తర్వాత…
గత ఏడాది డిసెంబర్‌లో రవితేజ వెంకీ మూవీ రీ రిలీజ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రెండు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. వెంకీ కంటే కిక్ ఎక్కువగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. రీ రిలీజ్ మూవీస్‌లో కలెక్షన్స్ పరంగా కిక్ రికార్డులు క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.
ఈగల్ కలెక్షన్స్…
ఇటీవల ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఐదు రోజుల్లో 18 కోట్ల కలెక్షన్స్ సాధించింది. మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లను రాబడుతోంది. ఈగల్ మూవీకి కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఈగల్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు రవితేజ. ఈ ఏడాదే మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ కానుంది. ధమాకా, ఈగల్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో రవితేజ చేస్తోన్న మూడో మూవీ ఇది.