Poonam Pandey: పూనమ్ పాండేపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

Best Web Hosting Provider In India 2024

Poonam Pandey: బాలీవుడ్ హాట్ నటి, మోడల్ పూనమ్ పాండే.. తన చావుపై చేసిన డ్రామా రచ్చరచ్చగా మారింది. సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ పాండే చనిపోయారంటూ ఫిబ్రవరి మొదట్లో ఆమె ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ వచ్చింది. దీంతో పూనమ్ చనిపోయిందని అందరూ నమ్మారు. కొందరు సెలెబ్రిటీలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఒక్క రోజు తర్వాత తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే వీడియో వెల్లడించింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కోసం ఇలా చేశానంటూ పూనమ్ చెప్పగా.. ఇది సరైన తీరు కాదంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే, పూనమ్ పాండే చేసిన ఈ నకిలీ చావు రచ్చ గురించి తాజాగా పరువు నష్టం కేసు దాఖలైందని తెలుస్తోంది. పూనమ్‍తో పాటు ఆమె భర్త సామ్ బాంబేపై ఓ వ్యక్తి రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది. ఆ వివరాలివే..

ఆ రిపోర్ట్ ప్రకారం.. పూనమ్, సామ్‍పై ఫైజల్ అన్సారీ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్‍లోని కాన్పూర్ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. చావు పేరుతో డ్రామాలు ఆడి.. క్యాన్సర్ అంశంలో సీరియస్‍నెస్ తగ్గేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఎమోషన్లను పూనమ్ పాండే కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ కస్టడీలోకి తీసుకొని.. కోర్టులో హాజరు పరచాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.

“పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబే.. మరణం పేరుతో కుట్ర పన్నారు” అని తన ఫిర్యాదులో అన్సారీ తెలిపారని ఆ రిపోర్ట్ వెల్లడించింది. సర్వైకల్ క్యాన్సర్ బాధితులు, బాధిత కుటుంబాలకు బాధ కలిగేలా వారిద్దరూ చేశారని ఆరోపించారు. ఇందుకు గాను రూ.100కోట్లకు వారిపై దావా వేస్తున్నారని తెలిపారు.

పూనమ్ పాండే ‘డెత్ స్టంట్’ వివరాలు

సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ పాండే చనిపోయారంటూ ఆమె అధికారిక ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఫిబ్రవరి 2న ఓ పోస్ట్ కనిపించింది. ఆమె మేనేజ్‍మెంట్ కూడా ఇది నిజమే అన్నట్టుగా పబ్లికేషన్లకు చెప్పారు. దీంతో అందరూ పూనమ్ చనిపోయారని అనుకున్నారు. అయితే, తాను జీవించే ఉన్నానని, సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేశానని పూనమ్ ఫిబ్రవరి 3న ఓ వీడియో పోస్ట్ చేశారు.

గర్భాశయ క్యాన్సర్‌ టెస్టులు చేయించుకోవాలని, హెచ్‍వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆ వీడియోలో పూనమ్ పాండే చెప్పారు. “నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించలేదు. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వేలాది మంది మహిళల విషయంలో నేను ఇలా చెప్పలేను. దీని గురించి ఎలాంటి అవగాహన లేని కారణంగా.. వారు ఏమీ చేయలేకపోయారు” అని పూనమ్ చెప్పారు. మిగితా క్యాన్సర్లలాగే.. సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా నయం చేసుకోవచ్చని, టెస్టులు చేయించుకోవాలని చెప్పారు. హెచ్‍వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆ వీడియోలో సూచించారు.

పూనమ్ పాండే చేసిన ఈ చావు డ్రామాపై ఓ మూడు రోజులు నానా రచ్చ జరిగింది. ఆమెపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పూనమ్ అలా చేసినందుకే అంతటా సర్వైకల్ క్యాన్సర్‌పై చర్చ జరుగుతోందని దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ఆమెను సమర్థించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024