Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి కొడాలి నాని
అమిత్ షా, మోడీ ఆఫర్ దెబ్బకు.. బాబు మంచానపడి వారం నుంచి ఏపీకి రావడం లేదు
హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా?
విజయవాడ: కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఒంటరిగా వైయస్ జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు అందరిని వెంటబెట్టుకుని ఎన్నికలకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. వీళ్ళందరూ ఉన్న ధైర్యం సరిపోని చంద్రబాబు ఢిల్లీ పెద్దలను మబ్బులో పెడదామని వెళ్ళాడని ఆరోపించారు. అక్కడ ఉన్నది అమిత్ షా, మోడీ కావడంతో వాళ్లిచ్చిన ఆఫర్ దెబ్బకు.. హైదరాబాద్ వెళ్లి మంచంపై పడి వారం నుంచి ఏపీకి రావడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో ముందు నుయ్యి, వెనక గొయ్యిలా చంద్రబాబు పరిస్థితి మారిందన్నారు.
పవన్ హెలిప్యాడ్ అనుమతి అంశంపై కొడాలి నాని స్పందించారు. హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా అంటూ ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో…. భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకున్నాడని ఆయన విమర్శించారు. జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామో పవన్ చెప్పగలడన్నారు. మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది.. లేదా ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చన్నారు. భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి.. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడు గమనించుకోవాలని కొడాలి నాని పేర్కొన్నారు.