Dermatomyositis: డెర్మాటోమయోసిటిస్… దంగల్ నటిని చంపిన అరుదైన వ్యాధి ఇదే, ఇది సోకితే నరకమే

Best Web Hosting Provider In India 2024

Dermatomyositis: అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అందులో ఇద్దరు చిన్నపిల్లలతో సినిమా మొదలవుతుంది. చిన్నప్పటి బబిత ఫోగట్ పాత్రను పోషించింది సుహానీ భట్నాగర్. ఆమె 19 ఏళ్ళకే మరణించింది. అంత చిన్న వయసులో ఆమె ఎందుకు మరణించిందో వివరించారు ఆమె కుటుంబ సభ్యులు. ఆమెకు డెర్మాటోమయోసిటిస్ అనే ఒక అరుదైన వ్యాధి సోకింది. దీనివల్లే ఆమె చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్టు రెండు నెలల క్రితమే కొన్ని లక్షణాలు కనిపించాయి. పది రోజుల క్రితం ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయింది. నిర్ధారణ అయ్యాక ఆమె ఎన్నో రోజులు జీవించలేకపోయింది.

ట్రెండింగ్ వార్తలు

ఏమిటీ డెర్మాటోమయోసిటిస్?

డెర్మాటోమయోసిటిస్… ఈ అరుదైన వ్యాధి ఎందుకు వస్తుంది? అనేది కచ్చితంగా చెప్పలేమని వివరిస్తున్నారు వైద్యులు. కండరాలకు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది రావచ్చని చెబుతున్నారు. బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లు, UV రేడియేషన్ కారణంగా, వాయు కాలుష్యం, కొన్ని రకాల టీకాల కారణంగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

కొలెస్ట్రాల్ కరిగించుకోవడానికి ఉపయోగించే స్టాటిన్స్ వంటి మందుల వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ప్రతి లక్ష మందిలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఈ వ్యాధి వస్తుంది. అందుకే దీన్ని ఎంతో అరుదైన వ్యాధిగా చెబుతారు.

దీని లక్షణాలు…

డెర్మాటోమయోసిటిస్ అనేది ఒక అరుదైన ఇన్ఫ్లమేషన్ వ్యాధి. ఇది సోకితే కండరాలు బలహీనంగా మారుతాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. భుజాలు, చేతులు, తొడలు, మెడ కండరాలు చాలా బలహీనంగా అయిపోతాయి. దీనివల్ల కనీసం చేయి కూడా పైకి లేపలేరు. కుర్చీ నుండి లేక మంచం నుంచి లేవడం చాలా కష్టంగా మారిపోతుంది. ఇక చర్మంపై వచ్చే దద్దుర్లు చాలా విచిత్రంగా ఊదా రంగులో ఉంటాయి. దద్దుర్లు కళ్లపై, చెంపలపై, ఛాతీ పై భాగంలో కనిపిస్తూ ఉంటాయి. కీళ్ల నొప్పులు అధికంగా వస్తాయి. గుండె, ఊపిరితిత్తుల కండరాల కణజాలాలలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది. చర్మానికి కండరాలకు సరఫరా చేసే రక్తనాళాల్లోనూ వాపు ఉండొచ్చు. అందుకే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనికి చికిత్స ప్రాథమిక దశలోనే తీసుకోవాలి. లేకుంటే మింగడం, శ్వాస ఆడడం కూడా కష్టంగా మారిపోతుంది.

డెర్మాటోమయోసిటిస్ చికిత్స

ఈ వ్యాధికి ఖచ్చితమైన చికిత్స లేదు, కానీ ప్రాథమిక దశలోనే కొన్ని రకాల మందులు, వ్యాయామం, హీట్ థెరపి, విశ్రాంతి వంటివి తీసుకుంటే లక్షణాలను తగ్గించవచ్చు. ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవచ్చు. డెర్మాటోమయోసిటిస్ వ్యాధి బారిన పడినవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. సూర్యరశ్మి ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్లను రాసుకుంటూ ఉండాలి. డాక్టర్లు ఇచ్చే మందులను క్రమం తప్పకుండా వాడాలి. వారికి రోగనిరోధక శక్తిని తగ్గించే మందులను ఇస్తారు. ఎందుకంటే రోగనిరోధక వ్యవస్థ సొంతంగా తమ శరీరంలోని కండరాలపైనే దాడి చేస్తుంది. అందుకే రోగనిరోధక శక్తి పెరగకుండా తగ్గించేందుకు మందులు ఇస్తారు. ఇలాంటి అరుదైన వ్యాధులు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024