Best Web Hosting Provider In India 2024
కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్ పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి భేటీ అయ్యారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ అనంతరం ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు ముద్రగడ పద్మనాభంను కలిశామని, ఈ సందర్బంగా ముద్రగడను వైయస్ఆర్ సీపీలోకి ఆహ్వానించామని చెప్పారు. త్వరలోనే ముద్రగడ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం గొప్ప ఉద్యమం చేసిన నేత ముద్రగడ, ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని, స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారన్నారు. సీఎం వైయస్ జగన్‌కు పెద్దలను ఎలా గౌరవించాలో తెలుసని, ముద్రగడకు సముచిత స్థానం ఇస్తారని మిథున్‌రెడ్డి అన్నారు. ముద్రగడను కలిసిన వారిలో పెద్దాపురం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జ్ దవులూరి దొరబాబు, జగ్గంపేట ఇన్చార్జ్ తోట నరసింహం ఉన్నారు.