Mahashivratri Prasadam: మహాశివునికి ఈ సొరకాయ హల్వాను నైవేద్యంగా సమర్పించండి, శివ ప్రసాదంగా పంచి పెట్టండి

Best Web Hosting Provider In India 2024

Mahashivratri Prasadam: మహాశివరాత్రి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండేవారు ఎందరో. ఉపవాసంలో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఏమీ తినరు. రాత్రికి అల్పాహారాన్ని తింటారు. ముఖ్యంగా శివుని ప్రసాదాలను అల్పాహారం గా స్వీకరించేవారు ఎందరో. అలాంటివారు ఒకసారి సొరకాయ హల్వాను శివునికి నైవేద్యంగా సమర్పించి, ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శివుడికి మహాశివరాత్రి రోజు కచ్చితంగా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఉప్పు వేసిన పదార్థాలను పెట్టకూడదు. కాబట్టి భక్తులు కూడా మహాశివరాత్రి రోజు జాగారం ఉంటే ఆ రోజు ఉప్పు వేసిన పదార్థాలను తినకుండా ఉంటే మంచిది. అందుకే తీయని సొరకాయ హల్వా రెసిపీని ప్రయత్నించండి. ఇది మీకు శివుని నైవేద్యంగాను, అలాగే రాత్రిపూట అల్పాహారంగానూ పనికొస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

సొరకాయ హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు

సొరకాయ తురుము – రెండు కప్పులు

పాలు – ఒక కప్పు

నెయ్యి – రెండు స్పూన్లు

కిస్‌మిస్‌లు – గుప్పెడు

జీడిపప్పు – గుప్పెడు

పంచదార – ముప్పావు కప్పు

సొరకాయ హల్వా రెసిపీ

1. సొరకాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.

3. అందులో కిస్‌మిస్‌లు, జీడిపప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి.

4. అదే నెయ్యిలో ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ తురుమును వేసి వేయించుకోవాలి.

5. మంట చిన్నగా పెట్టుకోవాలి. లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది.

6. ఇప్పుడు సొరకాయ తురుము మెత్తగా అయ్యాక పంచదారను వేసి కలుపుకోవాలి.

7. పంచదార కరిగి దగ్గరగా అవుతుంది అప్పుడు కాచి చల్లార్చిన పాలను వేయాలి.

8. ఈ మొత్తం మిశ్రమం మిశ్రమం హల్వాలాగా దగ్గరగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి.

9. ఈ మిశ్రమం దగ్గరగా అయ్యాక ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ పైన చల్లుకొని స్టవ్ కట్టేయాలి.

10. అంతే టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయినట్టే. దీన్ని చేయడం చాలా సులువు కేవలం అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఇది అయిపోతుంది.

సొరకాయ హల్వాను ప్రసాదంగా, నైవేద్యంగా, స్నాక్‌గా… ఎలా అయినా ఇది ఉపయోగపడుతుంది. పంచదార వినియోగించడం ఇష్టం లేనివారు బెల్లాన్ని ఇందులో వేసుకోవచ్చు. బెల్లం వేస్తే దీని రంగు మారే అవకాశం ఉంది.

మహాశివరాత్రి రోజు శివునికి తీపి నైవేద్యంగా ఈ సొరకాయ హల్వాను నివేదించవచ్చు. అలాగే భక్తులు కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. సొరకాయ తినడం వల్ల ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఒకసారి ఈ హల్వాను చేసి చూడండి. క్యారెట్ హల్వా లాగే సొరకాయ హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయలో ఉండే పోషకాలు అన్నీ శరీరానికి అందుతాయి. ముఖ్యంగా సొరకాయలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. వేసవికాలంలో సొరకాయతో చేసిన ఆహారాలు తినడం చాలా ముఖ్యం. ఇది డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఈ సొరకాయ హల్వాను ప్రయత్నించి చూడండి. మీ ఇంటిల్లి పాదికి నచ్చడం ఖాయం.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024