Best Web Hosting Provider In India 2024
Dhanush Sekhar Kammula Kubera: మహా శివరాత్రి రోజున టాలీవుడ్ ప్రేక్షకులకు వరుస సర్‌ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. కొత్త సినిమాల మేకర్స్ ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ వీడియోలను పోటీ పడి రిలీజ్ చేశారు. తాజాగా ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కుబేర అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ధనుష్, శేఖర్ కమ్ముల కుబేర
అసలు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్ అంటేనే తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ ముగ్గురూ కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్లకు మహా శివరాత్రినాడు సర్‌ప్రైజ్ ఇస్తూ మూవీ టైటిల్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు కుబేర అనే టైటిల్ పెట్టడం విశేషం.
ఈ సందర్భంగా ధనుష్ ఫస్ట్ లుక్ తో ఓ గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియో మొదట గౌరీశంకరులను చూపిస్తూ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కెమెరా మెల్లగా వాళ్ల నుంచి దూరంగా జరుగుతుండగా.. ధనుష్ ఎంట్రీ ఇస్తాడు. పూర్తిగా వెరిసిపోయిన గడ్డంతో, ఓ సింపుల్ డ్రెస్ లో అతడు కనిపించాడు. చివర్లో ధనుష్ కెమెరా వైపు తిరిగి ఓ స్మైల్ ఇస్తాడు.
ఆ తర్వాత మూవీ టైటిల్ పడుతుంది. మొదట తమిళంలో టైటిల్ పడగా.. తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో టైటిల్ రివీల్ చేశారు. ఈ కుబేర మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే గ్లింప్స్ వీడియోలో ధనుష్ లుక్, టైటిల్ రెండూ పరస్పరం విరుద్ధంగా ఉండటం మూవీపై ఆసక్తి రేపుతోంది.
తిరుపతిలో షూటింగ్ ఇదేనా?
ఆ మధ్య డీఎన్ఎస్ గా పిలిచిన ఈ మూవీ షూటింగ్ తిరుపతిలో జరిగిన విషయం తెలిసిందే. అప్పుడే ధనుష్ వీడియో బయటకు వచ్చింది. అందులో అతడు పూర్తిగా ఓ బిచ్చగాడి వేషంలో కనిపించాడు. తిరుపతిలో నడిరోడ్డుపై మూవీ షూటింగ్ జరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తి షూటింగ్ ను మధ్యలోనే నిలిపేసినట్లు కూడా వార్తలు వచ్చాయి.
అయితే షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పాడు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో చూస్తే.. అప్పుడు తిరుపతిలో రోడ్డుపై కనిపించినట్లే ధనుష్ కనిపిస్తున్నాడు. అయితే కుబేర అనే టైటిలే చాలా ఆసక్తి రేపుతోంది. ఓ బిచ్చగాడిలా కనిపిస్తున్న ధనుష్ పాత్ర.. కుబేరుడిలా మారే క్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారా అన్న చర్చ నడుస్తోంది.
ఈ సినిమాలో ధనుష్, నాగార్జునతోపాటు రష్మిక మందన్నా కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్ నటుడు జిమ్ సర్బా కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ కుబేర మూవీని సునీల్ నారంగ్, రామ్మోహన్ రావు కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల ఈ కుబేరతో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.