Opinion: పథకాలతో ఎన్నికల మ్యాచ్ గెలవొచ్చా?

Best Web Hosting Provider In India 2024

మాములుగా అయితే ఇది ఎండాకాలమే! కానీ, ఐపీఎల్ రాకతో ఇది క్రికెట్ సీజన్ గా మారిపోయింది. సూపర్ మ్యాచ్ లు, సూపర్ ఓవర్లు, స్టార్ బ్యాట్స్ మెన్ కొట్టే సూపర్ సిక్సుల గురించే ఇక చర్చంతా! బహుశా ఈ క్రికెట్ టెర్మినాలజీలో చెప్తే బాగా ఎక్కుతుందనేమో… తెలుగుదేశం పార్టీ ‘బాబు సూపర్ సిక్సు’లను ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలకు పోటీగా బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో రూపొందించిన ఈ సూపర్ సిక్స్‌లో మొత్తం ఆరు సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి ‘బాబు సూపర్ సిక్సు’ సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల మ్యాచ్‌ను గెలిపించగలవా? ఈ అంశంపై పీపుల్స్ పల్స్ సంస్థ చేసిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు

బాబు సూపర్ సిక్స్‌లో మొదటి హామీలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రెండో హామీలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయిల ఆర్థిక సాయం, మూడో దాంట్లో ప్రతి రైతుకు రూ. 20,000 ఆర్థిక సాయం, నాలుగో హామీలో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ఐదో హామీగా ప్రతి మహిళకి నెలకు రూ. 1500, ఆరో హామీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. వీటన్నింటినీ కలిపి సూపర్ సిక్స్‌గా పిలుస్తున్నారు. ఈ హామీలను జాగ్రత్తగా గమనిస్తే కొత్త సీసాలో పాత నీరు నింపారని ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే, బస్సు ప్రయాణం మినహా ఇవి జగన్ అమలు చేస్తున్న నవరత్నాలకు కొనసాగింపేగానీ, కొత్తదనమేమీ లేదు.

ఈ ఎన్నికల్లో మళ్లీ జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్సార్సీపీ ప్రచారం చేస్తోంది. అయితే, ఇలాంటి రొటీన్ ప్రచారాలను ప్రజలు నమ్మడం ఏనాడో మానేశారు. గతంలో అధికార పార్టీ ఓడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే భయం ఉండేది. కానీ, సోషల్ మీడియా ప్రభావం వల్ల అవగాహన పెరిగి పథకాలకు ఖర్చు పెట్టే డబ్బులు నాయకుల జేబుల్లో నుంచి ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం… ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నడుస్తున్న సంక్షేమ పథకాలను ఆపే పరిస్థితుల్లో లేరు. పీపుల్స్ పల్స్ బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన పథకాలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రివాల్, బెంగాల్ లో మమతా బెనర్జీ, కర్నాటకలో సిద్దరామయ్య, లేదా బీజేపీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా కేవలం పేర్ల మార్పు తప్ప ఇంచుమించు అందరూ ఒకే రకమైన పథకాలు అమలు చేస్తున్నారు.

 

సంక్షేమ పథకాలది సూక్ష్మ పాత్రే

ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా సరే… అధికారం మారినప్పుడల్లా సంక్షేమ పథకాలు పెరగుతున్నాయి తప్ప, తగ్గడం లేదు. ఇది ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోవడం వల్ల ఓటు వేసేటప్పుడు సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదు. పీపుల్స్ పల్స్ గతంలో వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలించినప్పుడు, సంక్షేమ పథకాలు పోషించేది సూక్ష్మ పాత్రేనని తేలింది. ఒకేవేళ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయంటే, అధికారంలో ఉన్న పార్టీలే ఎప్పుడూ గెలవాలి! తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ యుగపురుషుడిగా పేరుగాంచిన ఎన్టీ రామారావు 80వ దశకంలో హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. అయినా, 1989లో ఓడిపోయారు. ఆ ఓటమికి కారణం… అహంకారపూరిత ధోరణి, ప్రజాస్వామ్య విలువల్ని కాలరాయడమే. ఆ రోజుల్లో ఆయన ఆటా, మాటా, పాటా మీద నిబంధనలు విధించడాన్ని ప్రజలు సహించలేదు.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా 2004 నుంచి 2009 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎన్టీఆర్‌కి సమానంగా పేరు తెచ్చుకున్నారు. అయినా 2009 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి పాస్ మార్కులు వచ్చాయి. ప్రజారాజ్యం, లోక్ సత్తా ఓట్లు చీలిపోవడం, మహా కూటమిగా పోటి చేసిన టీడీపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టుల్లో ఓట్ల బదిలీ జరగకపోవడం వల్లే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగింది కానీ, సంక్షేమ పథకాల వల్ల కాదు. 2009లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించారు. అయినా సరే, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.

 

పక్క రాష్ట్రం తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత అన్నా డీఎంకే ఆమె అమలు చేసిన పథకాలన్నింటినీ అమలు చేసింది. అయినా తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది. 2014లో కూడా చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు చూసి ఎవరూ ఓటేయలేదు. కొత్త రాష్ట్రాన్ని అనుభవం కలిగిన ఒక పరిపాలన దక్షకుడి చేతిలో పెట్టాలనే ప్రజలు టీడీపీకి ఓట్లేశారు. ఆ తర్వాత ఆయన అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో వేల కోట్లు మహిళల ఖాతాల్లో వేసినా వైఎస్సార్సీపీకే ఓట్లేశారు.

తెలంగాణలోనూ అదే పరిస్థితి

మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవడానికి కారణం ఆరు గ్యారెంటీలు కాదని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ లో తేలింది. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే, కేసీఆర్ కూడా మళ్లీ కరెంటు కోతలు వస్తాయి, నీళ్లు ఉండవు, పథకాలు రావని ప్రచారం చేశారు. అయినా సరే… ప్రజలు ఆయనను నమ్మలేదు. పదేళ్లు అవకాశం ఇచ్చాం చాలనుకున్నారు. అహంకార ధోరణి, కుటుంబ పాలన వద్దనుకున్నారు. ప్రజలు ఎన్ని కష్టాలైనా భరిస్తారు కానీ, అహంకారాన్ని మాత్రం సహించరని ఎన్టీఆర్, కేసీఆర్, చంద్రబాబుల ఓటములు నిరూపించాయి.

 

ఆంధ్రప్రదేశ్ లో మా బృందం విస్తృతంగా పర్యటిస్తూ… ‘రావాలి జగన్, కావాలి జగన్ అని మీరే కదా అన్నారు’ అని అడిగినప్పుడు… ఒక్క చాన్స్ అడిగారు ఇచ్చాం. ఆ చాన్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన ఇస్తాడని ఇచ్చామని చెప్తున్నారు. అంతేగానీ, ఆయన ప్రకటించిన నవరత్నాలను చూసే గెలిపించామని కాదు. కానీ, తాను 125 సార్లు బటన్ నొక్కి, రూ. 2.5 లక్షల కోట్లు నిధులు ప్రజలకు పంచానని, రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు ఈ నిధులు అందాయి కాబట్టి 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు రావాల్సిందేనని జగన్ లెక్కలేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా తన పథకాలకు ఇన్ని కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు కాబట్టి, అన్ని ఓట్లు వస్తాయని జగన్ అనుకోవడం అత్యాశే అవుతుంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి సంఖ్య, పార్టీలకు వచ్చే ఓట్లు ఎప్పుడూ మ్యాచ్ కావని గత ఎన్నికల చరిత్రను గమనిస్తే తెలుస్తుంది.

ఆ మాటకొస్తే నవరత్నాలదే పైచేయి

వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేసినప్పుడు ప్రజలు కేవలం సంక్షేమ పథకాలనే కాకుండా, సమాంతర అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు. అభివృద్ధితో పాటు ప్రజా స్వామ్యబద్ధంగా లభించే స్వేచ్ఛా, మాట్లాడే హక్కును కూడా కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఏపీ ప్రజలు కూడా ఇవే చెప్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికరణ ద్వారా ఎక్కువ అభివృద్ధిని కోరుకుంటున్నారు తప్ప సూపర్ సిక్సులను, నవరత్నాలను కాదు.

 

ఒకవేళ ఈ ఎన్నికలు నవరత్నాలు వర్సెస్ సూపర్ సిక్సుల మధ్య జరిగితే జగన్ నవరత్నాలే పైచేయి సాధిస్తాయి. చంద్రబాబుకి సంక్షేమ విరోధి అనే పేరుంది. ఈ సూపర్ సిక్స్ ని పవన్ కళ్యాణ్ తో ప్రచారం చేయిస్తే కొంతైనా నమ్మే అవకాశాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో జగన్ తాను ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు నూరు శాతం సంక్షేమ పథకాలు సమయానికి అమలు చేశారు. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదనే ఫిర్యాదు ఎక్కడా లేదు. అభివృద్ధి చేయకపోవడం, కనీస ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని పాటించకుండా అహంకారంతో వ్యవహరించడం వల్లే ఆయన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

ప్రజలు ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే అని అనుకోవడం లేదు. ఏదో ఒక ఉపాధి దొరకాలి. చేతికి ఇంత పని దొరకాలి. రోడ్లు బాగుండాలి అనుకుంటున్నారు. పనుల కోసం వలసలు వెళ్లిన వారు తిరిగి గ్రామాల్లో ఉపాధి పొందేలా ప్రణాళికలు సిద్ధం చేసి, వాటిని ప్రజలకు వివరించాలి. దీనికోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలి. దీనికోసం పరిశ్రమలు తీసుకురావడం, కుల వృత్తులపై శిక్షణ ఇవ్వడం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే, ప్రతి చేనుకు నీరు అందేలా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలి. దీనికి సంబంధించి ప్రజల్లో భరోసా కలిగిస్తేనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయి.

 

-జీ. మురళీ కృష్ణ,

రీసర్చర్, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ

జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్
జి.మురళీ కృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, రీసెర్చర్

(డిస్‌క్లెయిమర్: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

WhatsApp channel
 

టాపిక్

 
 
OpinionPolitical AnalysisTdp ManifestoJanasena ManifestoAndhra Pradesh Assembly Elections 2024Lok Sabha Elections 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024