Best Web Hosting Provider In India 2024
ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజా సమస్యలు గుర్తుకు వస్తాయా..!
నీ హయాంలో ఒక్క త్రాగునీటి ప్రాజెక్టు అయినా తెచ్చావా
ఉదిరిపికొండ పైపులైన్ పనులు అడ్డుకుంది నువ్వు కదా
కేశవ్ ఒక సీజనల్ పొలిటీషియన్.. పార్ట్ టైం ఎమ్మెల్యే
ఉరవకొండ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: గడిచిన ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉన్నావా… కనీసం కరోనా సమయంలో కనిపించావా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై. విశ్వేశ్వరరెడ్డి…టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఉరవకొండ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లు కనిపించని పయ్యావుల కేశవ్ కు ఎన్నికలు అనగానే ఎక్కడలేని ప్రజా సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉందని, అంతకుముందు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీ విప్ గా,మరల ఇప్పుడు ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ గా ఉన్నావు మరి నీ 30 ఏళ్ల రాజకీయ జీవితంలో సాధించిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కనీసం ఒక్క తాగునీటి ప్రాజెక్ట్ అయిన తెప్పించావా..? ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించిన పరిస్థితి ఉందా అని అడిగారు.
ఈరోజు ఉరవకొండ పట్టణానికి సరఫరా అవుతున్న శ్రీరామరెడ్డి తాగునీటి పథకం తమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసింది అన్నారు. ఉరవకొండ నియోజకవర్గానికి తాగునీటి కోసం నీవు చేసిన శాశ్వతమైన మంచి పని ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉరవకొండ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాను ప్రభుత్వంతో మాట్లాడి 50 కోట్ల రూపాయలతో ఉదిరిపికొండ నుంచి ఉరవకొండ వరకు త్రాగునీటి పైపులైన్ మంజూరు చేయించారని అయితే ఆ పనులను పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పనులను చేసేందుకు టెండర్ వేసిన సదరు వ్యక్తి కేశవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతనిపై ఒత్తిడి తెచ్చి పనులు మొదలు పెట్టకుండా అడ్డుకున్నది నిజం కాదు కేశవ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉరవకొండ ప్రజల దాహార్తిని తీర్చడానికి చేపట్టిన తాగునీటి పథకం పనులు జరిగితే ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందోనని ఉరవకొండ ప్రజల గొంతు ఎండిపోయేలా చేస్తున్నది వాస్తవం కాదా అన్నారు. పనులు అడ్డుకున్నది నువ్వు ఈరోజు త్రాగునీరు ఇవ్వడం లేదంటూ దొంగ ఏడుపులు ఏడ్చేది నువ్వేనా అంటూ మండిపడ్డారు. ప్రజలు కూడా మోసగాడి మాటలు, చేతల పట్ల అప్రమత్త ఉండాలని సూచించారు. ఉరవకొండ నియోజకవర్గంలో 3 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు, 800 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేపట్టామని మమ్మల్ని విమర్శించే నైతిక అర్హత కేశవ్ కు లేదన్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అపూర్వమైన ఆదరణ
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మేమంతా సిద్ధం అంటూ వైయస్ జగన్ పట్ల ఎనలేని ఆదరాభిమానాలతో జన సునామీ లాగా వస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభిస్తోందన్నారు. ప్రజాభిమానం చెక్కుచెదరకపోగ మరింత పెరిగిందన్నారు. వైయస్ జగన్ ను చూడడానికి ప్రజలు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. ఈ బస్సు యాత్ర ను అనంతపురం జిల్లాలో విజయవంతం చేసిన వైయస్ఆర్ అభిమానులకు ప్రజలకు వైయస్ఆర్సీపీ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు.
వృద్ధులు, వితంతువులు’ వికలాంగుల పింఛన్లు ఆపిన పాపం టిడిపిదే
దేశానికే ఆదర్శంగా నిలిచి అన్ని సేవలను ప్రజల వద్దకు చేరుస్తు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచిన వాలంటీర్ల సేవల పట్ల ఎన్నికల కమిషన్ కు పిర్యాదు చేసి అవ్వ, తాతలకు, వితంతువులకు, వికలాంగులకు ఇలా అందరికీ సేవలు అందించకుండా చేసిన పాపం తెలుగుదేశం పార్టీ దే అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు మండుటెండల కాలంలో ప్రజలకు ఉపయోగపడకుండా ఉండాలని వీరు చేసిన ఘనకార్యం వల్ల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారన్నారు.
ప్రజలందరికీ జరుగుతున్న ఈ అసౌకర్యం కష్టానికి బాధ్యత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు వీరన్న, మాజీ ఎంపీపీ చంద్రమ్మ, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏసీ ఎర్రిస్వామి, పట్టణ, రూరల్ సమన్వయకర్త ఓబన్న, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, ఉప సర్పంచ్ వన్నప్ప, నాయకులు వేమన్న, చిన్న భీమా, జయరాములు తదితరులు పాల్గొన్నారు.