Best Web Hosting Provider In India 2024
Fake Naxalites: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇద్దరు యువకులు అడ్డదారులను ఎంచుకున్నారు. వరంగల్ Warangal నగరంలో పెద్ద పెద్ద ఆసుపత్రులు, బిగ్ షాట్ లను సెలక్ట్ చేసుకుని నక్సలైట్ల పేరున బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు నకిలీ లెటర్ హెడ్ పత్రాలు సృష్టించి, మావోయిస్టుల Maoists పేరున లేఖలు కూడా పంపించారు.
ట్రెండింగ్ వార్తలు
చివరకు ఆసుపత్రి యజమానుల Hospital Owners ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకులను కటకటాల పాల్జేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ Hanmakonda ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్లపాడు గొల్లపల్లికి చెందిన దాసరి శ్రీకాంత్, మరో యువకుడు వరంగల్ కరీమాబాద్ కు చెందిన బాలిని మహేశ్ ప్రైవేటు ఉద్యోగులుగా పని చేస్తున్నారు.
ఇద్దరూ పరిచయం ఉన్న వ్యక్తులు కావడం, వచ్చే ఆదాయం ఖర్చులకు చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నకిలీ నక్సలైట్ అవతారం ఎత్తారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) మావోయిస్ట్ పార్టీ చర్ల–శబరి ఏరియా కమిటీ పేరున నకిలీ లెటర్ హెడ్ పత్రాలు తయారు చేశారు.
వాటిపై తాము ఎంచుకున్న వ్యక్తులకు సంబంధించిన సమాచారం రాసి, బెదిరించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా వరంగల్ నగరంలోని బడా ఆసుపత్రులను సెలెక్ట్ చేసుకుని, వాటి యజమానులను బెదిరింపులకు గురి చేయడం ద్వారా డబ్బుల రాబట్టాలని నిర్ణయించుకున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్తల బెదిరింపులు
తమ ప్లాన్ లో భాగంగా దాసరి శ్రీకాంత్, బాలిని మహేశ్ ఇద్దరూ నాలుగు రోజుల క్రితం సీపీఐ మావోయిస్ట్ పార్టీ చర్ల–శబరి ఏరియా కమిటీ దళ కమాండర్ దేవన్న పేరున ఒక లెటర్ తయారు చేశారు. అందులో ప్రముఖ వ్యాపారవేత్త నాయినేని సంపత్ రావుకు చెందిన ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ సమీపంలోని ఎన్ఎస్ఆర్ ఆసుపత్రి, ఎన్ఎస్ఆర్ డెయిరీకి సంబంధించిన వివరాలతో పాటు నగరంలో ప్రముఖ ఆసుపత్రులైన అజారా, దీపక్ స్కిన్ క్లీనిక్ లను మెన్షన్ చేస్తూ లెటర్ రాశారు.
ఎన్ఎస్ఆర్ గ్రూప్ సంస్థల నుంచి అజారా, దీపక్ స్కిన్ క్లీనిక్ హాస్పిటల్స్ కు ఎక్కువ ధరకు పాలను అమ్ముతున్నారని, రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ డబ్బులు అధిక మొత్తంలో దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్ఎస్ఆర్ గ్రూప్ సంస్థల యజమానులు హస్పిటల్ తో పాటు ఆస్తుల వివరాలు, భూమి పత్రాలు, ఇంటి స్థల పత్రాలు, ఆసుపత్రి లైసెన్స్, డబ్బులు పట్టుకుని తాము చెప్పిన చోటుకు రావాలని అందులో రాశారు.
ఈ విషయాన్ని పోలీసులకు చెబితే ఈడీ, సీబీఐ అధికారులకు పట్టిస్తామని హెచ్చరించారు. లేదా నక్సలైట్ల చేతిలో చచ్చిపోతారని బెదిరింపులకు పాల్పడ్డారు. లేఖల విషయంలో అనుమానం కలిగిన ఎన్ఎస్ఆర్ సంస్థల యాజమాన్యం ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో, అజారా, దీపక్ స్కిన్ క్లీనిక్ యజమానులు హనుమకొండ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
నకిలీ నక్సల్స్ అరెస్ట్
మావోయిస్టుల పేరున వచ్చిన బెదిరింపుల కేసు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఒకటి, హనుమకొండ పీఎస్ లో రెండు కేసులు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు ఎన్ఎస్ఆర్, అజారా, దీపక్ స్కిన్ క్లీనిక్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఆరా తీశారు. వారు ఇచ్చిన సమాచారంతో నిందితులను గుర్తించారు.
నకిలీ నక్సలైట్ పేరున బెదిరింపులకు పాల్పడిన దాసరి శ్రీకాంత్ ములుగు వైపు నుంచి వరంగల్ నగరానికి వస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు వరంగల్ పెద్దమ్మగడ్డ సమీపంలోని హనుమాన్ జంక్షన్ వద్ద మంగళవారం వెహికిల్ చెకింగ్ చేపట్టారు. అదే సమయంలో దాసరి శ్రీకాంత్ అక్కడికి చేరుకోగా.. అతడిని పట్టుకుని విచారణ జరిపారు.
దీంతో శ్రీకాంత్ అసలు వాస్తవాన్ని ఒప్పుకోగా.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్ట్ పేరుతో లెటర్ ప్యాడ్ తయారు చేయించిన బాలిని మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరూ నేరం అంగీకరించగా.. వారి నుంచి రెండు ఫోన్లు, మావోయిస్టుల పేరు తయారు చేసిన 65 ఖాళీ లెటర్ ప్యాడ్ పేపర్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
బెదిరిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి: ఏసీపీ
ఎవరైనా నక్సలైట్ల పేరున బెదిరింపులకు పాల్పడితే వెంటనే భయపడిపోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, దోషులను పట్టుకుని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తుల గురించి సమాచారం అందినా తమకు తెలియజేయాలని ఏసీపీ దేవేందర్ రెడ్డి కోరారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం
టాపిక్