Best Web Hosting Provider In India 2024
Silence 2 OTT Release Date: మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. జీ5 ఓటీటీలోకి అలాంటి మూవీ మరొకటి రాబోతోంది. గతంలో సైలెన్స్ పేరుతో వచ్చిన మూవీకి ఇప్పుడు సైలెన్స్ 2 ది నైట్ ఔల్ బార్ షూటౌట్ పేరుతో సీక్వెల్ వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను ఆ ఓటీటీ మంగళవారం (ఏప్రిల్ 2) రాత్రి రిలీజ్ చేసింది.
సైలెన్స్ 2 ఓటీటీ రిలీజ్ డేట్
అబన్ బరూచా దేవ్‌హన్స్ డైరెక్ట్ చేసిన ఈ సైలెన్స్ 2 మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ, ప్రాచీ దేశాయ్ కలిసి నటించిన ఈ సినిమా జీ5 (ZEE5) ఓటీటీలో ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జీ స్టూడియోస్, క్యాండిడ్ క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. ఈ సీక్వెల్ కూడా ఎంతో ఉత్కంఠ రేపేలా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
సైలెన్స్ మూవీలో ఏసీపీ అవినాష్ వర్మగా నటించిన మనోజ్.. ఈ సీక్వెల్ ద్వారా మరోసారి అదే పాత్రలో రాబోతున్నాడు. వరుస హత్యల వెనుక ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి అవినాష్ అండ్ టీమ్ ఏం చేయబోతున్నారన్నది ఈ మూవీలో చూడొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్స్ జానర్ ఇష్టపడే వాళ్లు ఈ సెలెన్స్ 2 మూవీని అస్సలు మిస్ కావద్దని జీ5 ఓటీటీ అంటోంది.
జీ5 ఓటీటీలో సరిగ్గా మూడేళ్ల కిందట అంటే మార్చి, 2021లో సైలెన్స్ మూవీ వచ్చింది. ఆ మూవీని కూడా అబన్ డైరెక్ట్ చేసింది. బాలీవుడ్ లో డియర్ జిందగీ, టీస్పూన్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ఆమె.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెసైంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత సీక్వెల్ తో రాబోతోంది.
సైలెన్స్ 2 ట్రైలర్ ఎలా ఉందంటే?
సైలెన్స్ 2 ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. నైట్ ఔల్ అనే బార్ లో జరిగిన షూటౌట్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. దీనిని పరిష్కరించడానికి అవినాష్ అండ్ టీమ్ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత క్రైమ్ సీన్ లో షూటౌట్ జరిగిన విధానాన్ని అవినాష్ వివరిస్తుంటాడు. అందులో ఓ అమ్మాయిని ముందు నుంచి ఆ షూటర్ ఎందుకు కాల్చాడన్న ప్రశ్న దగ్గర అతడు ఆగిపోతాడు.
ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు హత్య చేశారన్న పాయింట్ నుంచి అతడు తన విచారణ మొదలుపెడతాడు. ఆ తర్వాత కథలో వచ్చే ట్విస్టులు, సవాళ్లను ట్రైలర్ లో చూపిస్తారు. ఈ కథను ఎవరు డైరెక్ట్ చేస్తున్నా.. దీని చివరి సీన్ మాత్రం మనమే రాద్దామంటూ తన టీమ్ తో అవినాష్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ముగుస్తుంది.
వరుస హత్యలు, వాటిని చేసిన హంతకులను పట్టుకునే మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతాయి. అందులోనూ మనోజ్ బాజ్‌పాయీలాంటి నటుడు ఉండటంతో సైలెన్స్ 2 కూడా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సైలెన్స్ తొలి పార్ట్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పైనా మేకర్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.