Best Web Hosting Provider In India 2024
Tillu Square day 5 box office collection: సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లూ స్క్వేర్ మూవీ ఊహించినట్లే బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్లే తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో వీక్ డేస్ లోనూ ఈ మూవీ మంచి వసూళ్లే సాధిస్తోంది. తాజాగా ఐదు రోజుల కలెక్షన్లు కలిపి రూ.85 కోట్లు కావడం విశేషం.
టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్
టిల్లూ స్క్వేర్ మూవీ గత శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంగళవారం (ఏప్రిల్ 3) వరకు తొలి ఐదు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ముందుగా చెప్పినట్లే టిల్లూ స్క్వేర్ దూసుకెళ్తోంది.
“టిల్లూ స్క్వేర్ ఐదు రోజుల్లోనే రూ.85 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్ బస్టర్ రన్ కొనసాగుతోంది. రూ.100 గ్రాస్ వైపు దూసుకెళ్తోంది. మన స్టార్ బాయ్ అన్ని చోట్లా రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు” అనే క్యాప్షన్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ కలెక్షన్ల విషయాన్ని షేర్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లోనే రూ.68 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. వీక్ డేస్ లోనూ దుమ్ము రేపుతోంది.
సోమ, మంగళవారాల్లోనూ టిల్లూ స్క్వేర్ దూకుడు కొనసాగుతోంది. సోమవారం రూ.10 కోట్లు, మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.7 కోట్లు వసూలు చేసింది. ఈ శుక్రవారం (ఏప్రిల్ 5) విజయ్ దేవరకొండ ఫ్యామిలీస్టార్ తప్ప ఈ సినిమా పెద్దగా పోటీ ఏమీ కనిపించడం లేదు. వచ్చే వారం ఉగాది, రంజాన్ హాలిడేస్ ఉండటంతో టిల్లూ స్క్వేర్ జోరు కొనసాగేలా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టిల్లు హవా
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే టిల్లూ స్క్వేర్ మూవీ ఐదు రోజుల్లో రూ.49 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజు ఏపీ, తెలంగాణల్లో రూ.9.25 కోట్లతో మొదలు పెట్టిన ఈ మూవీ.. రెండో రోజు రూ.7.36 కోట్లు, మూడో రోజు రూ.7.44 కోట్లు, నాలుగో రోజు రూ.3.91 కోట్లు, ఐదో రోజు రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే ఐదో రోజు కూడా రూ.1.58 కోట్లు రాబట్టింది. మొత్తంగా ఈ ఏరియా నుంచి ఐదు రోజుల్లో అత్యధికంగా రూ.16.08 కోట్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా రూ.32 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ చేసిన టిల్లూ స్క్వేర్ మూవీ మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అన్ని ఏరియాల్లోనూ లాభాల బాట పట్టనుంది. ఇక మూవీ ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ రూ.35 కోట్లకు దక్కించుకుంది. ఆ లెక్కన ఎన్నో నెలల పాటు ఊరించి వచ్చినా.. మేకర్స్ కు మంచి లాభాలు అందించనుంది. సిద్దూ జొన్నలగడ్డ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవనుంది.