Best Web Hosting Provider In India 2024
AC Precautions: మండే ఎండల్లో ప్రతి ఒక్కరూ ఏసీకి అలవాటు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నవేళలో ఎండలను తట్టుకోలేక ఏసీ రూముల్లో చేరిపోతున్న వారి సంఖ్య ఎక్కువే. ఎయిర్ కండిషనర్ చక్కగా పనిచేయాలంటే దానిలో రిఫ్రిజిరేంట్ ఉండాలి. దీన్నే గ్యాస్ అని కూడా పిలుస్తారు. ఎప్పుడైతే ఏసీలో గ్యాస్ తగ్గుతుందో వెంటనే తిరిగి ఆ గ్యాస్‌ను నింపాల్సిన అవసరం ఉంది. ఏసీలో గ్యాస్ తగ్గుతున్న కొద్దీ ఎయిర్ కండిషనర్ పనితీరు కూడా తగ్గిపోతుంది. ఇల్లు చల్లగా మారదు. ఏసీ వేసిన తర్వాత ఇల్లు చల్లగా అవ్వలేదంటే ఏసీలో గ్యాస్ తగ్గుతుందేమో అని చూసుకోవాలి.
ఏసీలో గ్యాస్ తగ్గితే ఏమవుతుంది?
ఏసీలో గ్యాస్ పరిమాణం తగ్గినా కూడా దాన్ని వాడితే ఏమవుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏసీ వేయగానే గదిలోని వేడిని గ్రహించి ఆ వేడిని బయటికి పంపించి… ఇంట్లో చల్లదనం ఉండేలా చేస్తుంది. ఎప్పుడైతే సిస్టంలో తగినంత గ్యాస్ ప్రసరణ జరగదో… ఏసీ వేడిని గ్రహించే సామర్థ్యాన్ని తగ్గించుకుంటుంది. దీనివల్ల చల్లటి గాలి చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఏసీ నడుస్తున్నప్పటికీ ఇల్లు మాత్రం చల్లబడదు.
మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో… ఎయిర్ కండిషనర్‌కు కంప్రెసర్ అంతే ముఖ్యమైనది. ఈ కంప్రెసర్ సరిగా పనిచేస్తేనే ఏసీ కూడా సవ్యంగా తన పని తాను చేయగలదు. ఇది ఒత్తిడిని సృష్టించడానికి, గదిలోని ఉష్ణాన్ని బయటకు బదిలీ చేయడానికి చాలా అవసరం. గ్యాస్ సాయంతోనే కంప్రెషర్ పనిచేస్తుంది. ఎప్పుడైతే గ్యాస్ తగ్గుతుందో… కంప్రెసర్ పై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ విపరీతమైన ఒత్తిడి కంప్రెసర్ వేడెక్కేలా చేస్తుంది. మరీ వేడెక్కితే అది పాడైపోతుంది. కొన్ని సందర్భాల్లో కంప్రెషర్‌ను రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. కంప్రెసర్ మార్చాలంటే చాలా ఖర్చవుతుంది.
ఏసీలో గ్యాస్ తగ్గితే సామర్థ్యం తగ్గిపోతుంది. గాలి ప్రవాహం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఏసీ నడుస్తున్నప్పటికీ ఇల్లు చల్లగా లేదంటే… అది గ్యాస్ తగ్గడం వల్లనేమోనని తెలుసుకోవాలి. ఏసీ యూనిట్ నుండి హిస్సింగ్ శబ్దాలు వస్తున్నా కూడా గ్యాస్ లీక్ అవుతుందని సూచనగా భావించాలి. ఇండోర్ కాయిల్ పై మంచు వంటి నిర్మాణాలు కనిపిస్తే అది కూడా గ్యాస్ తక్కువ అవడం వల్లే జరుగుతుందని అర్థం చేసుకోవాలి. లేదా కాయిల్ ఘనీభవించడం వల్ల ఇలా అవుతుంది అనే భావించాలి.
గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు ఏసీ ని ఆపరేట్ చేయకూడదు. గ్యాస్ తక్కువగా ఉన్నా కూడా ఏసీని వేస్తే కంప్రెసర్ పై ఒత్తిడి తీవ్రంగా పడుతుంది. వెంటనే గ్యాస్‌ను ఫిల్ చేసి ఆ తర్వాతే ఏసీని వాడడం అలవాటు చేసుకోవాలి.
టాపిక్