T Congress MP Candidates : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సైబర్​ కేటుగాళ్ల వల – బీఫామ్ కోసం డబ్బులు కట్టాలంటూ ఫోన్ కాల్స్..!

Best Web Hosting Provider In India 2024

Phone Calls to Congress MP candidates : పార్లమెంట్​ ఎన్నికలు (Loksabha Elections 2024) సమీపిస్తున్న వేళ.. సైబర్​ నేరగాళ్లు కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థులను టార్గెట్​ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ ఖరారు చేసిన అభ్యర్థుల లిస్ట్ (Telangana Congress MP Candidates)​ చేతిలో పట్టుకుని, వారందరికీ ఫోన్​ కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. బీ ఫామ్​ రెడీ అయ్యిందని, డబ్బులు అకౌంట్​ కు పంపిస్తే వెంటనే బీ ఫామ్​ చేరవేస్తామని చెప్పి అభ్యర్థులను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. విషయం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో అభ్యర్థులు సైబర్​ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

కడియం కావ్యకు కాల్…

బుధవారం రాత్రి సమయంలో వరంగల్ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యకు(Kadiyam Kavya) గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. తాము ఏఐసీసీ నుంచి మాట్లాతున్నామని, కావ్య పేరున బీ ఫామ్​ రెడీ అయ్యిందని చెప్పారు. బీ ఫామ్​ పంపడానికి రూ.76 వేలు తమ ఖాతాకు ట్రాన్స్​ ఫర్​ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకు ఓకే చెప్పి కాల్​ కట్​ చేసిన కాంగ్రెస్​ అభ్యర్థి కావ్య, అనుమానంతో వెంటనే అలర్ట్ అయి గాంధీభవన్​ కు ఫోన్​ చేసి ఆరా తీసింది. కానీ అదంతా ఫేక్ అని అక్కడి నుంచి సమాచారం అందడంతో డబ్బులు పంపకుండా వదిలేశారు.

గాంధీ భవన్ నుంచే అభ్యర్థుల లిస్ట్​!

సైబర్​ నేరగాళ్లు మొదట కాంగ్రెస్​ పార్టీ ఆఫీస్​ గాంధీ భవన్​ కే కాల్​ చేసినట్లు తెలిసింది. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఫోన్​ చేస్తున్నామని పార్టీ ఆఫీస్​ కు కాల్​ చేసి, తెలంగాణలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా పంపాల్సిందిగా గాంధీభవన్​ సిబ్బందిని అడిగారు. దీంతో ఎన్నికల సమయం కావడం, పైగా ఏఐసీసీ(AICC) ఆఫీస్​ నుంచి కాల్​ చేస్తున్నట్టు చెప్పడంతో అక్కడి సిబ్బంది నిజమే కావచ్చునని అభ్యర్థుల వివరాలు అందించారు. దీంతో ఆ సమాచారం ఆధారంగా సైబర్​ నేరగాళ్లు ఒక్కో అభ్యర్థికి ఫోన్​ చేసి డబ్బులు డిమాండ్​ చేయడం మొదలు పెట్టారు. కడియం కావ్యతో పాటు రాష్ట్రంలోని మరికొంతమంది అభ్యర్థులకు కూడా కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేసినట్లు తెలిసింది. కొందరి నుంచి రూ.99 వేల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం. కాగా అభ్యర్థులందరికీ ఫోన్​ చేస్తున్న సైబర్​ కేటుగాళ్లు డబ్బులు బీ ఫామ్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఒక్కొక్కరుగా గాంధీ భవన్​ కు సమాచారం అందించడంతో విషయం కాస్త బయటపడింది. కాగా అభ్యర్థులెవరూ డబ్బులు పంపించకుండా చాకచక్యంగా వ్యవహరించడంతో సైబర్​ కేటుగాళ్ల ప్లాన్​ బెడిసి కొట్టినట్లయ్యింది.

అలర్ట్​ గా ఉండాలని ఏఐసీసీ సూచన

కాంగ్రెస్​ అభ్యర్థులను సైబర్​ నేరగాళ్లు టార్గెట్​ చేసిన నేపథ్యంలో విషయం ఏఐసీసీ వరకు చేరింది. దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే తీరుగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ కాంగ్రెస్​ పార్టీ నేతలు, అభ్యర్థులకు సూచనలు ఇచ్చింది. బీ ఫామ్​ లకు డబ్బులు అడిగితే ఎవరూ పంపొద్దని, సైబర్​ నేరగాళ్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురి ఇలా సైబర్​ నేరగాళ్లు కాల్​ చేసి డబ్బులు డిమాండ్​ చేయగా.. ఎవరూ పంపాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ఇటీవల కాలంలో సైబర్​ నేరాలు విపరీతంగా పెరిగిపోతుండగా… జనాలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు.

రిపోర్టింగ్ – వరంగల్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel

టాపిక్

Telangana CongressTrending TelanganaHyderabadWarangal Lok Sabha ConstituencyWarangalAnupama Parameswaran
Source / Credits

Best Web Hosting Provider In India 2024