Best Web Hosting Provider In India 2024
May Tollywood Releases 2024: సినిమా ఇండస్ట్రీకి బెస్ట్ సీజన్స్‌లో సమ్మర్ ఒకటి. వేసవిలో స్టార్ హీరోల సందడితో థియేటర్లు కళకళలాడుతోంటాయి. అయితే ఈ సారి సమ్మర్ సీజన్లో సీన్ రివర్స్‌లో ఉంది. ఐపీఎల్‌తో పాటు ఎలక్షన్స్ కారణంగా పెద్ద హీరోలు ఎవరూ బాక్సాఫీస్ బరిలో నిలవలేదు.
ఒక్క స్టార్ హీరో మూవీ కూడా వేసిలో రిలీజ్ కాలేదు. మే నెలలో రిలీజ్ కావాల్సిన ప్రభాస్ కల్కితో పాటు పలు పెద్ద సినిమాలు వాయిదాపడటంతో ఈ గ్యాప్‌ను వాడుకునేందుకు పలు మీడియం, లో బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ సినిమాలు ఏవంటే?
మే 3న నాలుగు సినిమాలు రిలీజ్…
మే ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్లో అల్లరి నరేష్ చేసిన ఆ అక్కటి అడక్కు మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మల్లి అంకం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. పెళ్లి కష్టాలతో తెరకెక్కుతోన్న ఈ ఫన్ మూవీపై ఈ వారం ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి.
శబరి, ప్రసన్నవదనం…
అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతోంది. అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అవుతోంది.
సుహాస్ హీరోగా నటించిన ప్రసన్నవదనం మూవీ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. వీటితో పాటు తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన తమిళ డబ్బింగ్ బాక్ కూడా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూడు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ విన్నర్‌గా నిలువనుందన్నది మరో రెండు రోజుల్లో తేలనుంది.
సత్యదేవ్ కృష్ణమ్మ…
సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ మే 10న థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అగ్ర దర్శకుడు కొరటాల శివ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ మూవీతో వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా కృష్ణమ్మ థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మే 10న చిన్న సినిమా ఆరంభం తో పాటు అదా శర్మ సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్) కూడా థియేటర్లలోకి రాబోతోంది.
విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి…
గామి బ్లాక్‌బస్టర్ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో మే 17న బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు విశ్వక్సేన్ సిద్ధమయ్యాడు. ప గోదావరి జిల్లాల నేపథ్యంలో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తోన్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. అంజలి ఓ కీలక పాత్ర చేస్తోంది. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో థియేటర్లలో కాజల్ అగర్వాల్ సత్యభామ పోటీపడుతోంది. మే 17న థియేటర్లలో విడుదల అవుతోన్న ఈ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ మూవీలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నది. ఈ సినిమాకు గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేను అందిస్తోండగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తోన్నాడు. సత్యభామలో నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తోన్నాడు.
దిల్ రాజు లవ్ మీ…
బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, ఆశీష్ జంటగా నటించిన లవ్ మూవీ మే 25న విడుదల అవుతోంది. దెయ్యంతో ప్రేమలో పడిన ఓ యువకుడి కథతో తెరకెక్కిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తోన్నాడు. కీరవాణి మ్యూజిక్, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీతో రాబోతున్న ఈసినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు.
ఆనంద్ దేవరకొండ వర్సెస్ సుధీర్ బాబు…
మే చివరి వారంలో ఆనంద్ దేవరకొండ, సుధీర్‌బాబు బాక్సాఫీస్ బరిలో నిలిచారు. సుధీర్‌బాబు హీరోగా నటించిన హరోంహర మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో మాళవికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. జ్ఞానసాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్నాడు.
బేబీతో కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఈ సారి యాక్షన్ బాట పట్టాడు. గం గణేశా మూవీతో మే 31న బాక్సాఫీస్ బరిలో నిలిచాడు. గం గణేశా సినిమాకు ఉదయ్‌శెట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలతో ఆదాశర్మ సీడీ, రాజా రవీంద్ర సారంగదరియాతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.