Best Web Hosting Provider In India 2024
PV Ramesh On Land Titling Act : ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమై జరుగుతోంది. ఈ చట్టంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని వైసీపీ ఫిర్యాదుతో సీఐడీ చంద్రబాబు, లోకేశ్ పై కేసు నమోదు చేసే వరకూ వెళ్లింది. తాజాగా ఈ చట్టంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు తానూ ప్రత్యక్ష బాధితుడినని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు పెట్టారు. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని తెలిపారు. తహశీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారన్నారు. ఆర్డీఓకు పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి పంపించారన్నారు. చట్టం అమలులోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని పీవీ రమేష్ పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…జగన్ సీఎంఓలో పని చేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండని ఎక్స్ లో పోస్టు పెట్టారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇల్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదంటూ ఆరోపించారు.
చంద్రబాబు దుర్మార్గమైన కుట్రలు చేస్తున్నారు- పేర్ని నాని
చంద్రబాబు చెప్పినట్లు.. పీవీ రమేష్ ఆడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల తన భూమి మ్యుటేషన్ జరగలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టారు.. కొందరు రైతులకు ఉమ్మడిగా భూమి లీజుకిచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని 25 ఏళ్ల క్రితమే చెరువు చేశారన్నారు. పీవీ రమేష్ ఏడాదిక్రితం మ్యుటేషన్ కు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రైతు నాగేంద్రకు, పీవీ రమేష్ కు సరిహద్దు వివాదం ఉందని పేర్ని నాని ఆరోపించారు. జనవరిలో కలెక్టర్, ఆర్డీవో సమక్షంలో విచారణ జరిగిందన్నారు. పీవీ రమేష్ తన గుమస్తాతో ఒరిజనల్స్ కాకుండా జిరాక్స్ పంపించారని తెలిపారు. 70 ఎకరాల చెరువులో పీవీ రమేష్ పొలం ఎంతో తెలియదన్నారు. చెరువు సరిహద్దులు ఫిక్స్ చేస్తే ఆయన భూమి ఎంతో తేలుతుందన్నారు. పోలింగ్ అయ్యాక సర్వే చేస్తారని, పీవీ రమేష్ విన్నకోటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని పేర్ని నాని హితవు పలికారు.
ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ప్రతిపక్షాలు ఎన్నికల అస్త్రంగా మార్చుకున్నాయి. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఈ చట్టం అమల్లోకి తెచ్చి ప్రజల భూములు లాక్కుంటారని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలపై, సరిహద్దురాళ్ల పై జగన్ బొమ్మలు వేసుకున్నారని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
సంబంధిత కథనం
టాపిక్