Best Web Hosting Provider In India 2024
Medak Deaths: ఎలాంటి జాగ్రత్త తీసుకోకుండా, నీటి వనరులలోకి దిగటం వల్ల ప్రమాదాలు బారిన పడుతున్న ఘటనలు మెదక్లో తరచూ జరుగుతున్నాయి. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశత్తు ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూరు (డి) గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు (డి) గ్రామానికి చెందిన ఎలబంటి శివయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు కొడుకులు. కాగా మూడవ కొడుకు వినోద్ కుమార్ (23) ఇంటర్ వరకు చదువుకొని, కూలి పనులు చేసుకుంటూ జీవనం తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు.
ఒకరిని కాపాడిన స్నేహితులు.…
ఆదివారం వినోద్ తన స్నేహితులతో కలిసి కొత్తూరు గ్రామ శివారులోని మైనింగ్ స్వారీ సమీపానికి విందు చేసుకోవడానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేశాక ఎండ వేడిమి నుండి సేదతీరేందుకు ఇద్దరు క్వారీ గుంతలోకి దిగారు.
ఈ క్రమంలో వినోద్ కుమార్ తో పాటు మధు ఈత కొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఇద్దరికి ఈత రాకపోవడంతో ఇద్దరు కూడా నీటిలో మునిగిపోయారు. దీనిని పైన ఉన్న స్నేహితులు గమనించి మధుని కాపాడారు.
వినోద్ కుమార్ని స్నేహితులు నీటి నుండి బయటకి గుంజలేకపోయారు. స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అగ్ని మాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహాన్ని గుర్తించలేకపోయారు.
దీంతో గజ ఈతగాళ్ళని రప్పించి మరలా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి 24 గంటల తర్వాత సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి శివయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మంజీరా నదిలో పది బాలుడు మృతి…
ప్రమాదవశాతూ మంజీర నీటి కుంటలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివపల్లికి చెందిన బుమేష్, యశోద దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా బుమేష్ కుటుంబం కాలి ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం కాలీ సీసాలు ఎరటానికి బుమేష్ భార్యా కుమారులతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. సీసాలు ఏరుతూ మధ్యాహ్న సమయంలో తండ్రి,ఇద్దరు కుమారులతో కలిసి మంజీర నది మడుగులో స్నానం చేయడానికి వెళ్లారు. దీంతో పెద్ద కుమారుడు దుర్గేష్ (17) స్నానం చేసుకుంటూ లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మునిగిపోయాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్లని రప్పించి దుర్గేష్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా అసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి బుమేష్ పిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు చెరువులో మునిగి….
గత ఆదివారం రోజు, సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి మండలంలోని కెరూరు గ్రామంలో చేపల వేటకు చెరువులోకి దిగి ఇద్దరు మృతు చెందిన విష్యం విదితమే. గ్రామానికి చెందిన బడుగు కిరణ్ కుమార్ (23) చెరువులో మునిగిపోతుండగా, అతన్ని కాపాడపోయి చిన్నెళ్లి కిష్టయ్య (52) కూడా చెరువులో మునిగిపోయాడు. ఒకరోజు, గ్రామంలో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)
టాపిక్