Best Web Hosting Provider In India 2024
Diabetes: వేరు శెనగ పలుకులను మధుమేహం పేషెంట్లు తినవచ్చా? ఈ సందేహం డయాబెటిస్ రోగుల్లో కలుగుతుంది. ప్రపంచంలో కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య డయాబెటిస్. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఈ డయాబెటిస్ వస్తుంది. దీన్ని అదుపులో ఉంచుకోకపోతే శరీరంలోని ముఖ్య అవయవాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నరాలు, రక్తనాళాలకు డయాబెటిస్ వల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారంతో సహా అనేక కారణాల వల్ల మధుమేహం ప్రభావితం అవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆచితూచి ఆహారాన్ని ఎంపిక చేసుకుని తినాలి. ఎంతోమంది డయాబెటిక్ పేషెంట్లకు ఉన్న సందేహం వేరుశెనగ పలుకులను తినవచ్చా? లేదా? అని. ఇదే విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారో విందాం.
వేరుశెనగ గింజలు తినవచ్చా?
వేరుశెనగ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకి అత్యవసరమైనవి. వేరుశనగలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయన్న భయం లేదు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు వేరుశెనగ గింజలను తినవచ్చని, అది వారికి సురక్షితమైన ఆహారమని చెబుతున్నారు వైద్యులు. కొన్ని అధ్యయనాల ప్రకారం రోజువారీ ఆహారంలో వేరుశనగలను చేర్చుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.
వేరుశనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, మంచి కొవ్వు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా చేస్తాయి. అలాగే ఇతర ఆహారాలను అతిగా తినాలన్న కోరికను కూడా తగ్గిస్తాయి. దీన్ని బట్టి బరువును కూడా సులువుగా తగ్గించుకోవచ్చు. వేరుశెనగలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవి.
అయితే వేరుశనగలు ఆరోగ్యకరమైన ఆహారమే. అయినప్పటికీ వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి తినేటప్పుడు ఆచితూచి తినడం మంచిది. సమతుల ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం మంచిది. రోజుకి గుప్పెడు వేరుశనగలు తింటే అన్ని విధాలా శ్రేయస్కరం. మరీ ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరిగే అవకాశం ఉంది.
మధుమేహంతో బాధపడుతున్న వారు కొన్ని రకాల చిరుతిళ్లను ఎంపిక చేసుకోవచ్చు. ఓట్స్ తో చేసిన ఆహారాలు, మొలకెత్తిన గింజలతో వండిన ఆహారాలు, ఫూల్ మఖానా, పనీర్ వంటకాలు, పెసరపప్పు వంటకాలు తినడం వల్ల వారికి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
టాపిక్