Best Web Hosting Provider In India 2024
Undekhi Season 3: ఓటీటీల్లోకి ఈ వారం రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లలో ఒకటి అన్‌దేఖీ(Undekhi) సీజన్ 3. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు శుక్రవారం (మే 10) నుంచి మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సోనీలివ్ ఈ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.
అన్‌దేఖీ సీజన్ 3
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జానర్ ఇష్టపడే వాళ్లు మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ లలో ఈ అన్‌దేఖీ (Undekhi) కూడా ఒకటి. మూడో సీజన్ శుక్రవారం (మే 10) నుంచి సోనీలివ్ (Sonyliv)లో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ఒకవేళ మీరు ఇప్పటి వరకూ తొలి రెండు సీజన్లు చూడకపోయి ఉంటే వెంటనే వాటిని చూసేయండి.
హర్ష్ చాయా, వరుణ్ బడోలా నటించిన ఈ వెబ్ సిరీస్ తొలి రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ పెళ్లి వేడుకలో జరిగే రెండు హత్యల చుట్టూ తిరిగే కథ ఇది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ హత్యల కేసు చుట్టే రెండు సీజన్లు పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు మూడో సీజన్ తో వస్తున్నారు. ఇప్పటికే ఈ కొత్త సీజన్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. అవే పాత్రలు, అదే ఇంటెన్సిటీతో మూడో సీజన్ కూడా ఆకట్టుకోబోతోందని ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
అన్‌దేఖీ వెబ్ సిరీస్ కథేంటి?
పంజాబీ వెడ్డింగ్స్ ఎలా ఉంటాయో మనం చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లలో చూశాం. మందు, చిందు లేనిదే వాళ్ల పెళ్లిళ్లు జరగవు. అలాంటి ఓ బాగా డబ్బున్న పంజాబీ కుటుంబ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేయడానికి వచ్చిన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ఇద్దరు గిరిజన అమ్మాయిల హత్యలు జరుగుతాయి. మందు బాగా ఎక్కువై ఆ ఇంటి పెద్దే వాళ్లను కాల్చి చంపుతాడు.
బెంగాల్లో నేరం చేసి తప్పించుకొని పారిపోయి వచ్చిన ఆ ఇద్దరినీ వెతుక్కుంటూ అక్కడి పోలీస్ ఆఫీసర్ రావడం, ఈ పంజాబీ ఫ్యామిలీని అనుమానించడం, వాళ్ల వెంట పడటం, తమ పలుకుబడితో వాళ్లు తప్పించుకోవడానికి చూడటం.. ఇలా తొలి రెండు సీజన్లు సాగిపోయాయి. ఇప్పుడు వస్తున్న మూడో సీజన్లో హత్యలు చేసిన ఆ ఇంటి పెద్దను కచ్చితంగా లోపలేస్తా అంటూ ఆ పోలీస్ ఆఫీసర్ మళ్లీ రంగంలోకి దిగబోతున్నాడు.
అన్‌దేఖీ మూడో సీజన్ ఎందుకు చూడాలంటే?
అన్‌దేఖీ వెబ్ సిరీస్ మొదట్లోనే అందరూ చూస్తుండగానే ఈ రెండు హత్యలు జరిగినట్లు చూపించారు. అయినా ఆ హత్యలు చేసిన వ్యక్తి మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉంటాడు. రెండు హత్యల చుట్టూ రెండు సీజన్ల పాటు ఈ వెబ్ సిరీస్ ను లాగించినా.. మనకు ఎక్కడా బోర్ కొట్టదు. నటీనటులు తమ పాత్రల్లో పూర్తిగా లీనమైపోవడం, ఎక్కడా గాడి తప్పినట్లుగా అనిపించని కథతో సిరీస్ సాగిపోతూ ఉంటుంది.
మూడో సీజన్ ట్రైలర్ కూడా అంతే ఆసక్తికరంగా కట్ చేశారు. మరి ఈ కొత్త సీజన్లో అయినా హత్యలు చేసిన ఆ ఇంటి పెద్దను సదరు పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త సీజన్ ను మే 10 నుంచి సోనీ లివ్ ఓటీటీలో చూడొచ్చు.