నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఒంగోలులో నిర్వహించిన ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బాలయ్య, హీరోయిన్ శ్రుతిహాసన్ ఇతరులతో కలిసి శుక్రవారం హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. రాత్రికి ఒంగోలులోనే బసచేసిన బాలకృష్ణ శుక్రవారం ఉదయం అదే హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు.
అయితే హెలికాప్టర్ బయల్దేరిన 15 నిమిషాలకే వాతావరణం అనుకూలించకపోవడంతో వెనుదిరిగింది. పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణం కష్టమన్న భావనతో పైలట్లు ఒంగోలు పీటీసీ మైదానంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చేవరకు హెలికాప్టర్ బయలుదేరే పరిస్థితి కనిపించడం లేదు. బాలయ్య హెలికాప్టర్ సేఫ్గా ల్యాండ్ అయిందని తెలుసుకుని ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వీర సింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక శుక్రవారం ఒంగోలులో జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్గా నిర్వహించారు.