Best Web Hosting Provider In India 2024
Medak Thunderstrom: అకాల వర్షం ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కల్లంలో పోసిన వడ్లు తడుస్తాయని, వడ్ల పైన టార్పాలిన్ కవర్లు కప్పుదామని వెళ్లిన తాత, మనవడి పైన పిడుగు పడటంతో, వారిద్దరూ అక్కడిక్కడే మరణించిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి అనే గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన రైతు పాల్వంచ శ్రీరాములు (53), ఇటీవలే తన వరిపొలం కోసి, ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరడానికి పోశాడు. ధాన్యం కొనటానికి, తన నెంబర్ ఇంకా రాక పోవడంతో, ప్రతిరోజు వడ్లు ఎండబెట్టి సాయంత్రం పూట టార్పాలిన్ కవర్లు కప్పుతున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో హఠాత్తుగా ఉరుములు, గాలులతో కూడిన వర్షం వచ్చింది. చేతికొచ్చిన వడ్లు వర్షం నీటిలో తడుస్తాయని, తన మనవడు విశాల్ (11) ని తీసుకొని హుటాహుటిన ఐకేపీ సెంటర్ కు పరిగెత్తాడు శ్రీరాములు. వడ్లు అన్నికుప్పగా చేసి మీద టార్పాలిన్ కవర్లు కప్పతున్నపుడూ వారి ఇద్దరి పైన పిడుగు పడింది. ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. ఒక కుటుంబంలో ఇద్దరు మరణించడంతో, ఆ గ్రామంలో తీవ్ర విషాధచాయలు నెలకొన్నాయి.
కలెక్టర్ దిగ్బ్రాంతి….
వాతావరణంలో అసమతుల్యత వలన జిల్లాలో భారీ వర్షాల వస్తున్న నేపథ్యంలోధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పిడుగుపాటుతో రైతులు మరణించడం ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అన్నారు. హుటాహుటిన క్షేత్రస్థాయిలో రైతు కుటుంబాలను పరామర్శించడానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిసిఎస్ఓ లను ఘటనా స్థలానికి పంపించారు.
కొనుగోలు కేంద్రాల్లో దాన్యం వర్షాలకు తడిసిన కూడా ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న రెండు మూడు రోజుల్లో పిడుగులుతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ధాన్యం తడవకుండా కాపాడుకోవడం కోసం వర్షంలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని, కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం తడిసిన కూడా ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటాం…
అకాల వర్షం పిడుగులతో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండలంలోని రామోజీపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం 2.45 నిమిషాల వర్షం పడుతుందని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడుస్తుందని టార్పొలిన్ తో ధాన్యం కప్పే క్రమంలో దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో జరిగిన పిడుగుపాటుతో పాల్వంచ శ్రీరాములు శివరాజ్ అలియాస్ విశాల్ వయస్సు మరణించినట్టు చెప్పారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం తరఫున రావలసిన అన్ని సహాయక సహకారాలను ఎన్నికల నియమ నిబంధనల లోబడి అతి త్వరలో అందిస్తామని వివరించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)
టాపిక్