Best Web Hosting Provider In India 2024
Keerthy Suresh: కీర్తి సురేష్ దూకుడు మామూలుగా లేదు. ఆమె తాజాగా మరో పెద్ద బాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం రేసులో ఉంది. ఈసారి యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యే వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే మూవీలో కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడీ ప్రాజెక్ట్ కూడా వస్తే కీర్తికి బాలీవుడ్ లోనూ తిరుగుండదు.
కీర్తి సురేష్‌కు ఆ ఇద్దరితో పోటీ
ఫిల్మ్ మేకర్ ప్రియదర్శన్ తాను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల కిందట ఖట్టా మీటా మూవీ చేసిన ఈ ఇద్దరూ ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నారు. ఈసారి హారర్ కామెడీ జానర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చేతబడుల నేపథ్యంలో ఈ హారర్ ఫ్యాంటసీ కామెడీ తెరకెక్కనుంది.
నిజానికి 2007లో అక్షయ్.. భూల్ భులయ్యా చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి, ఈ రాబోయే మూవీకి అసలు పొంతనే ఉండదని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కోసం ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నారు. అందులో మన కీర్తి సురేష్ కూడా ఉంది. ఆమె ఆలియా భట్, కియారా అద్వానీలాంటి బాలీవుడ్ హీరోయిన్లతో ఈ పాత్ర కోసం పోటీ పడుతోంది.
మిడ్ డేలో వచ్చిన రిపోర్టు మేరకు ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. దీంతో ఈ పాత్ర కోసం మంచి నటన కనబరిచే వారి కోసం డైరెక్టర్ చూస్తున్నాడు. అందులోనూ అక్షయ్ కుమార్ సరసన కావడంతో అతని స్థాయికి తగినట్లు మంచి నటన, పేరు ఉన్న హీరోయిన్ అవసరం అని మేకర్స్ భావిస్తున్నారు.
ముగ్గురిలో ఎవరు?
ఈ సినిమా కోసం మేకర్స్ కీర్తి సురేష్ తోపాటు ఆలియా భట్, కియారా అద్వానీలను కూడా సంప్రదించారు. వీళ్లలో ఒకరిని ఫైనలైజ్ చేయనున్నారు. స్క్రిప్ట్ ఎవరికి నచ్చుతుందో చూసి వాళ్ల డేట్స్, రెమ్యునరేషన్ ఆధారంగా ఒకరిని ఎంచుకోనున్నారు. కీర్తి సురేష్ ఈ ఛాన్స్ కొట్టేస్తే మాత్రం బాలీవుడ్ లోనూ ఆమె దశ తిరుగుతుందనడంలో సందేహం లేదు.
అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ మూవీ ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి షెడ్యూల్ లండన్ లో జరగనుంది. ఆ తర్వాత ఇండియాలోని యూపీ, గుజరాత్ లలోనూ షూటింగ్ జరపనున్నారు. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిచనున్నారు. ఈ మూవీ కోసం భారీ సెట్లను వేయనున్నాడు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. ఇక సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ చేపట్టనున్నాడు.
వరుసగా మూడు నెలల పాటు షూటింగ్ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పూర్తి చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కీర్తి సురేష్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఇదే కాకుండా తమిళంలో రఘుతాతా, రివాల్వర్ రీటాలాంటి మూవీస్ లోనూ ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.