Best Web Hosting Provider In India 2024
Kannappa Movie Teaser: కన్నప్ప సినిమాపై అంతకంతకూ ఆసక్తి పెరుగుతోంది. భారీ మల్టీస్టారర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటంతో కన్నప్ప చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సీనియర్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‍కుమార్ కూడా ఈ మూవీలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీంతో కన్నప్పపై పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా నుంచి టీజర్ వచ్చేస్తోంది.
టీజర్ రిలీజ్ డేట్, టైమ్
కన్నప్ప సినిమా టీజర్ మే 20వ తేదీన రిలీజ్ కానుంది. కన్నప్ప ప్రపంచాన్ని దీంట్లో చూపిస్తామంటూ మంచు విష్ణు నేడు ట్వీట్ చేశారు. టీజర్ రిలీజ్ డేట్‍ను అధికారికంగా ప్రకటించారు. మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు టీజర్ వస్తుందని విష్ణు వెల్లడించారు.
ప్రతిష్టాత్మక వేదికపై..
ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కన్నప్ప టీజర్ లాంచ్ కానుంది. “ మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆగలేకపోతున్నా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో లాంచ్ కానుంది” అని మంచు విష్ణు నేడు (మే 13) ట్వీట్ చేశారు.
ఎముకలతో చేసిన ఆయుధాన్ని చేతిలో పట్టుకొని ఉన్న పోస్టర్‌ను కూడా విష్ణు రివీల్ చేశారు. ఆ ఆయుధానికి రక్తపు మరకలు ఉన్నాయి. ఈ నయా పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. కన్నప్ప నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు చాలా క్యూరియాసిటీని పెంచాయి. దీంతో టీజర్ ఎలా ఉంటుందోనని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా టీజర్లో చెబుతారేమో చూడాలి.
మహాశివుడి భక్తుడు కన్నప్ప జీవితంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మంచు విష్ణు డ్రీమ్ ప్రాజక్ట్‌లా భావిస్తున్నారు. ఈ మూవీలో కన్నప్పగా ఆయన నటిస్తున్నారు. మహాభారతం టీవీ సిరీస్‍ను తెరకెక్కించిన ముకేశ్ కుమార్ సింగ్.. కన్నప్ప చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‍తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్‌తో పాటు ప్రీతి ముకుందన్, శరత్‍కుమార్, బ్రహ్మానందం, దేవరాజ్, ఐశ్వర్య, ముకేశ్ రుషి కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మెలడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసీ సంగీతం అందిస్తున్నారు.
కన్నప్ప సినిమాలో చాలా మంది స్టార్ నటులు ఉన్నారని, అయితే ఎవరు ఏ పాత్ర పోషిస్తున్నారో అనే విషయంపై ఊహాగానాలు వద్దని మంచు విష్ణు తాజాగా చెప్పారు. ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారో తాను క్రమంగా వెల్లడిస్తామని, రూమర్లకు నమ్మవద్దని కోరారు. ఈ సినిమాలో ఓ పాత్ర చేయాలని రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గరికి వెళితే.. ఆయన మరో క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారని కూడా విష్ణు వెల్లడించారు. ప్రభాస్ ఎంపిక చేసుకున్న పాత్రను డెవలప్ చేశామని తెలిపారు.