Best Web Hosting Provider In India 2024
GV Prakash Kumar: మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ జోడీ పేరుగాంచిన జీవీ ప్రకాశ్ కుమార్, సైంధవి విడిపోయారు. తమ 11వ పెళ్లి రోజు జరుపుకున్న నెల రోజులకే వీళ్లు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. తమ ఇద్దరి మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పడం గమనార్హం. అటు సైంధవి కూడా ఇదే విషయం చెప్పింది.
ప్రకాశ్ కుమార్, సైంధవి విడాకులు
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి ఈ మధ్యే తమ 11వ పెళ్లి రోజు జరుపుకున్నారు. అయితే అంతలోనే తాము విడిపోతున్నట్లు ఇద్దరూ వేర్వేరు ప్రకటనల్లో చెప్పడం అభిమానులను షాక్ కు గురి చేసింది. ఈ సందర్భంగా ప్రకాశ్ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు. ఇద్దరి మానసిక ప్రశాంతతతో పాటు మెరుగైన జీవితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో వెల్లడించాడు.
“చాలా రోజుల మథనం తర్వాత 11 ఏళ్ల మా వివాహ బంధానికి తెరదించుతూ సైంధవి, నేను విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి మానసిక ప్రశాంతత, మెరుగైన జీవితాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ ఇద్దరం పరస్పరం గౌరవించుకుంటూనే ఉంటాం.
మా వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్న ఈ కీలకమైన మార్పు సమయంలో మా ప్రైవసీని అర్థం చేసుకొని గౌరవించాలని మీడియా, ఫ్రెండ్స్, అభిమానులను కోరుతున్నాం. ఇద్దరికీ ఇదే సరైన నిర్ణయం అని మేము నమ్ముతున్నాం. ఈ కష్ట సమయంలో మీ మద్దతు మాకు ఎంతగానో అవసరం. థ్యాంక్యూ” అని అతడు ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.
ప్రకాశ్, సైంధవి లవ్ స్టోరీ
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్, సింగర్ సైంధవి లవ్ స్టోరీ ఇప్పటిది కాదు. ఈ ఇద్దరూ స్కూల్ నుంచి ఒకే క్లాస్ లో చదువుకున్నారు. స్నేహితులు తర్వాత ప్రేమికులు అయ్యారు. 2013లో పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు 2020లో ఓ పాప కూడా జన్మించింది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు.
ఈ జీవీ ప్రకాశ్ కుమార్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ మేనల్లుడే. ప్రకాశ్ తల్లి ఏఆర్ రీహానా.. రెహమాన్ కు అక్క అవుతుంది. రెహమాన్ అసలు పేరు కూడా దిలీప్ కుమార్ అనే విషయం తెలిసిందే. అతడు తర్వాత ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఏఆర్ రెహమాన్ గా మార్చుకున్నాడు. నిజానికి గతేడాది పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా కూడా సైంధవి తమ పెళ్లి గురించి చేసిన పోస్ట్ వైరల్ అయింది.
తమ పెళ్లి జరిగి పదేళ్లు అవుతున్నా.. నిన్నే జరిగినట్లుగా ఉందని, నా లవ్ ఆఫ్ లైఫ్ ప్రకాశ్ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అని గతేడాది సైంధవి పోస్ట్ చేసింది. ఇది చూస్తే ఏడాది కాలంగానే ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ కుమార్ తెలుగులో నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇది కాకుండా తమిళంలో విక్రమ్ తంగలాన్, హిందీలో కంగనా రనౌత్ ఎమర్జెన్సీ, అక్షయ్ కుమార్ సర్ఫిరాలాంటి సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. అతడు కొన్ని సినిమాల్లోనూ నటించాడు.