Best Web Hosting Provider In India 2024
Janhvi Kapoor Partner: దేవర మూవీతో తెలుగులో అడుగుపెడుతున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కు కాబోయే వాడు ఎవరు? ఎలా ఉంటాడు? అతనికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఈ ప్రశ్నలు ఆమె అభిమానులందరినీ వేధిస్తూనే ఉంటాయి. దీనికి జాన్వీయే సమాధానం చెప్పింది. ఆ కాబోయే వాడు ఎవరో చెప్పకపోయినా.. అతడు ఎలా ఉండాలో మాత్రం ఆమె చెప్పడం విశేషం.
కాబోయే వాడి గురించి జాన్వీ ఏమన్నదంటే..
జాన్వీ కపూర్ తన నెక్ట్స్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మాహి ప్రమోషన్లలో ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సినిమాలో మేల్ లీడ్ గా నటించిన రాజ్ కుమార్ రావ్ తో కలిసి ఆమె ఈ ప్రమోషన్లకు వెళ్తోంది. ఇందులో భాగంగా బుధవారం (మే 15) ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగానే జాన్వీ తన కాబోయే వాడిలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి చెప్పింది.
ఈ ఈవెంట్లో మీడియాతో మూవీ టీమ్ మాట్లాడింది. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ మీకు కాబోయే వాడు ఎవరు? ఎలా ఉండాలి అని అడిగారు. దీనికి జాన్వీ స్పందిస్తూ.. తనకు ఎప్పుడూ అండగా ఉండే వాడు కావాలని చెప్పింది. “ఎలాంటి వాడంటే.. నా కలలను తన కలలుగా భావించేవాడు.. నాకు బలమిచ్చే వాడు. నన్ను ఎదగనిచ్చే వాడు.. నాకు సంతోషాన్నిచ్చేవాడు.. నన్ను నవ్వించేవాడు.. ఒకవేళ నేను ఏడుస్తుంటే.. నాకు అండగా నిలబడే వాడు కావాలి” అని జాన్వీ చెప్పింది.
జాన్వీ, శిఖర్ లవ్ స్టోరీ
తనకు కాబోయే వాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి జాన్వీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే జాన్వీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తోంది. ఆ మధ్య అంబానీల ప్రీవెడ్డింగ్ కు కూడా అతనితో కలిసి వెళ్లింది. తన మెడలో వేసుకున్న చెయిన్ లో శిఖర్ పేరున్న లాకెట్ ధరించింది.
దీంతో అతనితో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఆమె చెప్పకనే చెప్పింది. ఈ మధ్యే తిరుపతికి వచ్చినప్పుడు కూడా జాన్వీ వెంట శిఖర్ ఉన్నాడు. జాన్వీ తరచూ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుందన్న విషయం తెలిసిందే. కిందటిసారి వచ్చినప్పుడు ఆమె మోకాళ్లపై మెట్లు ఎక్కిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే. జాన్వీ, శిఖర్ చాలా రోజులుగా డేటింగ్ చేస్తున్నారు. ఆ మధ్య ఈ ఇద్దరూ విడిపోయి మళ్లీ కలిసినట్లు ఆమె తండ్రి బోనీ కపూర్ కూడా చెప్పాడు. శిఖర్ చాలా మంచి వాడని, జాన్వీకి దూరంగా ఉన్న సమయంలోనూ తనతో అతడు సఖ్యంగానే ఉండేవాడని బోనీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇక ప్రస్తుతం జాన్వీ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16లోనూ రామ్ చరణ్ సరసన జాన్వీయే ఫిమేల్ లీడ్ గా ఉంది.