Best Web Hosting Provider In India 2024
Farmers Protest : అకాల వర్షాలకు ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దై మొలకలెత్తుతున్నాయని, వేరే దారి లేక ప్రైవేట్ వ్యక్తులకు క్వింటాకు సగం ధరకే వడ్లన్నీ అమ్ముకుంటున్నామని ప్రభుత్వం తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రైతులు రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క పెట్టిన పెట్టుబడి రాక, దిగుబడి రాక నష్టపోతుంటే…….సకాలంలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయక,ప్రైవేట్ వ్యక్తులకు సగం ధరలకే అమ్ముకొని ఇంకా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో
కామారెడ్డి జిల్లా, మొహమ్మద్ నగర్ మండలం, కొమలంచ గ్రామంలో అధికారులపై రైతులు కన్నెర్ర చేశారు. తమ వడ్లను కొనుగోలు చేయడం లేదని, ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా…..అధికారులు కనీసం తమ బాధను వినిపించుకోవడం లేదని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాగా నామ మాత్రంగా ఐకేపీ కేంద్రంలో కోనట్టు చేసి వడ్లను తూకం వేసి లోడ్ ను మాత్రం రైస్ మిల్ కు తరలించడం లేదని, గత వారం రోజులుగా ఇక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయని, అకాల వర్షాలకు తమ వడ్లు తీవ్రంగా నష్టపోతున్నాయని ప్రభుత్వంపై రైతులు మండిపడ్డారు. కొమలంద ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…..రైతులను బుజ్జగించే ప్రయత్నాలు చేయగా…..రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో
ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఇటు అధికారులు, అటు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు మండలం, మల్క పేట రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కోనాలని డిమాండ్ చేస్తూ…..కానరావు పేట మండలం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. గత నెల రోజులుగా ఐకేపీ కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ ముందుకు కదలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వడ్లను కొనాలని వారు డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు రైతుల ధర్నా కొనసాగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో
“రేవంత్ అన్న అకాల వర్షాలకు మా ధాన్యం అంతా తడుస్తుంది ఇప్పటికైనా మా వడ్లు కొనండి ” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు భువనగిరి జిల్లా,భూదాన్ పోచంపల్లి మండలం, జూలూరూ గ్రామ రైతులు.గ్రామంలో వారం రోజులుగా ఐకేపీ కేంద్రంలో ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉందని, వర్షాలకు వడ్లు తడిసి మొలకలు యెత్తుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనేంత వరకు విశ్రమించేదే లేదని రోడ్డు పై మూడు గంటల వరకు బైఠాయించారు.రైతుల ధర్నా తో ఎక్కడి వాహనాల ఎక్కడే నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
రైతులు అధైర్యపడవద్దు
ధాన్యం కొనుగోళ్ల పై రాష్ట్రవ్యాప్తంగా రైతు నిరసనలు,ధర్నాలు, ఆందోళనలు ఇలా ఉంటే……ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం త్వరలోనే రైతులు పండించిన ప్రతీ గింజ కొంటామని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రులు చెబుతున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాల గురించి చర్చించారు. ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పుడు పాలనపై రెట్టింపు దృష్టి పెడతానని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు రుణమాఫీ, వడ్లు కొనుగోలు గురించి సీఎం ప్రధానంగా చర్చించారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం
టాపిక్