Best Web Hosting Provider In India 2024
Graduate Mlc Election: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత ఫలితాల దృష్ట్యా ఈసారి సత్తా చాటేందుకు ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రధాని మోదీ చరిష్మాతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంకు మెరుగుపరుచుకున్న ఆ పార్టీ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ తన బలాన్ని నిరూపించుకునేందుకు తహతహలాడుతోంది. ఇందులో భాగంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఆ పార్టీ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జులను కూడా నియమించింది.
ముఖ్య నేతలకు బాధ్యతలు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కసరత్తు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నిక ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు ను నియమించారు. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాల వారీగా కూడా ఆ పార్టీ ముఖ్య నేతలను ఇన్ఛార్జులుగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.
ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు బాధ్యతలు ఇచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని నియమించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మాజీ ఎమ్మెల్సీ కే.జనార్థన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
వారితో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని ఎమ్మెల్సీ ఎన్నిక కో ఆర్డినేటర్ గా నియమించారు. కో కోఆర్డినేటర్స్ గా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తూటుపల్లి రవికుమార్ ను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
రంగంలోకి కమలం పార్టీ నేతలు
2021 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. ఇందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,61,811 ఓట్లతో విజయం సాధించగా.. తీన్మార్ మల్లన్నకు 1,49,005 ఓట్లు పోలయ్యాయి.
తెలంగాణ జనసమితి నుంచి బరిలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరాం 71,126 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. బీజేపీ నుంచి పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డి 39,306 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. అప్పట్లో బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా బలం లేకపోగా.. ఇప్పుడు కేంద్రంలో ఉన్న మోదీ వేవ్ తో క్షేత్రస్థాయిలో పార్టీ కొంత మెరుగుపడింది.
దీంతో పట్టువదలకూడదనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జులను వెంటనే రంగంలోకి దించారు. ఈ మేరకు ఆయా జిల్లాల ఇన్ఛార్జులు శుక్రవారం నుంచి పక్కా ప్లాన్ అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనకు క్షేత్రస్థాయి బీజేపీ జిల్లా అధ్యక్షులు కొంతమేర సహకారం అందిస్తున్నారు.
శుక్రవారం నుంచి ఇన్ఛార్జిలు వర్క్ స్టార్ట్ చేయనుండగా.. సమయం, సందర్భాన్ని బట్టి పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు కూడా మూడు జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీపై కన్నేసిన బీజేపీకి ఈ ఉప ఎన్నిక అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్