Best Web Hosting Provider In India 2024
AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి వివాదాలతో అంత్యక్రియలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారాయి. సూర్యాపేట జిల్లాలో ఓ వృద్ధురాలి అంత్యక్రియలను కుమారుడు అడ్డుకోగా, ప్రకాశం జిల్లాలో వృద్ధుడి అంత్యక్రియల్ని భార్య అడ్డుకుంది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. డబ్బుల కోసం తల్లి అంత్యక్రియలు జరగకుండా కుమారుడు అడ్డుపడ్డాడు. కందులవారి గూడెంకు చెందిన లక్ష్మమ్మ ఇటీవల బాత్ రూమ్ లో కాలు జారిపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
ఆమె వద్ద ఉన్న 21 లక్షల రూపాయల నగదులో చికిత్స ఖర్చు సొమ్ము పోగా మిగిలిన దానిని ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. మృతదేహాన్ని కుమారుడి ఇంటికి తీసుకొచ్చారు. అయితే తల్లికి అంత్యక్రియలు చేయడానికి కుమారుడు అంగీకరించలేదు. గురువారం నుంచి అంత్యక్రియలు జరపకుండా ఉంచేశాడు.
లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేయడానికి పెద్ద కొడుకు సుముఖత చూపలేదు. లక్ష్మమ్మకు చెందిన 20తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లు తీసుకున్నారు. వైద్య చికిత్సలకు అయిన ఖర్చులకు పోగా మిగిలిన సొమ్ము వారే తీసుకున్నారని ఆరోపిస్తున్నాడు.
తనకు రావాల్సిన ఆస్తి పత్రాలు కూడా కూతురి వద్దే ఉన్నాయని, అంత్యక్రియల ఖర్చులు అంతా భరించాల్సిందేనని తేల్చి చెప్పాడు. దీంతో గ్రామస్తులు లక్ష్మమ‌్మ కుటుంబ సభ్యులపై మండిపడుతున్నారు. తల్లికి అంత్యక్రియలు చేయకుండా నిలిచిపోవడానికి కుమార్తెలే కారణమని కొడుకు ఆరోపిస్తున్నాడు.
గతంలో మరణించిన సోదరుడి అంత్యక్రియలు తానే చేసినట్టు లక్ష్మమ్మ కొడుకు చెప్పారు. తమను కాదని కూతుళ్ల వద్దకు వెళ్లిపోయిందని, ఆమె ఆస్తులు మొత్తం కూతుళ్లకు రాసిందని, తనకు రాసిన పొలం కాగితాలు కూడా తల్లి వద్దే ఉన్నాయని, వాటిని కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించాడు. గ్రామస్తులు వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించినా అవి కొలిక్కి రాలేదు.
ప్రకాశం జిల్లాలో…
ప్రకాశం జిల్లాలో కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని మర్రిగూడెం మండలం లో అయ్యపరాజుపాలెంలో ఓ వృద్ధుడు మూడు రోజుల క్రితం చనిపోయాడు. అతని ఆస్తుల విషయం తేలే వరకు అంత్యక్రియలు జరగనివ్వనంటూ భార్య అడ్డుకుంది.
65ఏళ్ల గుట్ల పల్లి వెంకటేశ్వర్లు మూడ్రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. అతని భార్య రమణమ్మ 40ఏళ్ల క్రితమే భర్తను విడిచి వెళ్లిపోయింది. ఆ తర్వాత సోదరులతో కలిసి ఉన్న వెంకటేశ్వర్లు తన పేరిట ఉన్న ఆస్తిని అన్నదమ్ముల కుమారులకు రాసిచ్చాడు. అతను చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు ఆస్తి తనకు దక్కాలంటూ భార్య అంత్యక్రియలు అడ్డుకుంది. ఈ క్రమంలో ఆస్తి తమకు దక్కుతుందంటే తమదేనని మూడ్రోజులుగా గొడవ పడుతున్నారు. వెంకటేశ్వర్లు శవం దుర్వాసన రావడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసుల ఎదుట కూడా ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. దీంతో అంత్యక్రియలు చేయకపోతే ఇరు వర్గాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చిరించడంతో చేసేది లేక వెంకటేశ్వర్లు అంత్యక్రియల్ని నిర్వహించారు. ఆస్తులు, నగదు కోసం అయిన వాళ్లే కొట్లాటలకు దిగడం రెండు ప్రాంతాల్లో చర్చనీయాంశం అయ్యాయి.
టాపిక్