సీఎం వైయ‌స్ జగన్‌ ఇంట ప్రారంభమైన సంక్రాంతి సంబరాలు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి.  సీఎం జగన్‌ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో  సీఎం జగన్‌ దంపతులు గోపూజ చేశారు .

రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం వైయ‌స్ జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు.

సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైయ‌స్ఆర్‌ విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టనున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్‌ నేతృత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శిస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతి రెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *