Best Web Hosting Provider In India 2024
Prabhas Instagram Story: టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి అంటూ ఏ వార్తలు వచ్చినా అభిమానులకు ఎంతో ఆసక్తి కలుగుతుంది. అలాంటిది ప్రభాసే తన పెళ్లి అనే సందేహం కలిగేలా పోస్ట్ చేస్తే ఇంకెలా ఉంటుంది? శుక్రవారం (మే 17) ఉదయం అతని చేసిన పోస్ట్ అలాంటి సంచలనమే రేపింది. కానీ తీరా చూస్తే అసలు విషయం అతని పెళ్లి కాదు.. కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్లని తేలింది.
ప్రభాస్ పోస్ట్ వెనుక అసలు కారణం ఇదీ
ప్రభాస్ శుక్రవారం ఉదయమే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ చేశాడు. “డార్లింగ్స్.. మొత్తానికి మన జీవితంలోకి ఓ ప్రత్యేకమైన వారు అడుగుపెట్టబోతున్నారు. వెయిట్ చేయండి” అని ప్రభాస్ చేసిన పోస్ట్ చూసి అతని పెళ్లి అని ఫ్యాన్స్ తో సహా అందరూ కన్ఫమ్ అయ్యారు. తీరా చూస్తే ఇది తన నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా చేసిందని తేలింది.
ఈ పోస్టుకు, ప్రభాస్ వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదట. ఈ సినిమా ప్రమోషన్ల కోసం మేకర్స్ ప్రత్యేకంగా ఓ కారు రూపొందించారట. అతని జీవితంలోకి వచ్చే ప్రత్యేకమైది ఇదే అని తెలిసింది. ఆ కారులోనే కల్కి 2898 ఏడీ మూవీ ప్రమోషన్లను మేకర్స్ చేయనున్నారు. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతోనే అభిమానులను ఆకట్టుకోవాలని వాళ్లు భావిస్తున్నారు.
నిజానికి ప్రభాస్ పెళ్లి అన్న చర్చ ఏడాది కాలంగా మరీ ఎక్కువగా సాగుతోంది. గతేడాదే అతడు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. 44 ఏళ్ల వయసున్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
మరో 40 రోజుల్లో..
ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ నటించిన ఈ కల్కి 2898 ఏడీ మూవీ మే 9నే రిలీజ్ కావాల్సి ఉన్నా ఎన్నికల కారణంగా జూన్ 27కు వాయిదా పడిన విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కు మరో 40 రోజుల సమయమే ఉండటంతో ప్రమోషన్ల జోరు పెంచడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ సినిమా కావడంతో అదే స్థాయిలో ప్రమోషన్లు ఉంటేనే భారీ ఓపెనింగ్స్ లభిస్తాయి.
దీంతో ప్రత్యేకంగా రూపొందించిన కారులో ప్రమోసన్లన్న కొత్త కాన్సెప్ట్ తో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కల్కి టీమ్ వివిధ సందర్భాల్లో తమ సినిమాలోని పాత్రలతో ప్రమోషన్లు నిర్వహించింది. ముంబైలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇల్లు మన్నత్ ముందు కూడా మూవీ ప్రమోషన్లు చేసి ఆకర్షించే ప్రయత్నం చేశారు.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ద్వాపర యుగంలో కృష్ణుడి నిర్యాణం నుంచి కలియుగంలో 2898 ఏడీ వరకు 6 వేల ఏళ్ల కాలానికి సంబంధించిన సినిమా ఇది అని గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పిన విషయం తెలిసిందే.