Best Web Hosting Provider In India 2024
AP Medical Services Recruitment Board Updates : ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవలే పలు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. 5 కొత్త మెడికల్ కళాశాలల్లో 158 ట్యూటర్ పోస్టుల(Tutors posts) భర్తీకి ప్రక్రియ షురూ కాగా…తాజాగా మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది.
వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హలైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫేజ్ -2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు https://dme.ap.nic.in లేదా http://apmsrb.ap.gov.in/msrb/ వెబ్ సైట్ లలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తుల్ని ఆన్ లైన్లో ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ లోగా సమర్పించాలని ఆయన సూచించారు.
కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు…
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ ప్రకటన – ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు.
- ఉద్యోగాలు – అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
- మొత్తం ఖాళీలు – 29
- అర్హతలు – దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. ఎండీ లేదా ఎంఎస్ చేసి ఉండాలి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు.
- ఎంపిక విధానం – వంద మార్కులను పరిగణనలోకి తీసుకుని రిక్రూట్ మెంట్ చేస్తారు.
- దరఖాస్తులు – ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు ప్రారంభం – మే 18, 2024.
- దరఖాస్తులకు తుది గడువు – మే 27, 2024.
- అధికారిక వెబ్ సైట్ – http://dme.ap.nic.in
క్రమశిక్షణా చర్యలు….
ఇన్ సర్వీస్ కోటా కింద పీజీ కోర్స్ లు పూర్తి చేసిన ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదేళ్ళపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలు అందించాల్సి ఉంటుంది. కొంతమంది ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించారని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇన్ సర్వీస్ వైద్యులు పీజీ కోర్స్ లలో చేరే సమయంలో ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్లపాటు ప్రభుత్వానికి సేవలందించాల్సి ఉందని ఆమె వివరించారు. ఈ షరతును అమలు చేయడంలో విఫలమైతే వారు రూ.20 లక్షలతో పాటు ప్రభుత్వం చెల్లించిన జీత భత్యాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వైద్యులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందనా లేదని తెలిపారు. నోటీసులందుకున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్లు జూన్ 15వ తేదీలోగా స్పందించని ఎడల వారిపై అమలులో ఉన్న నిబంధనల ప్రకారం చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
ఎవరెవరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్న వారి వివరాల్ని dme.ap.nic.in, cfw.ap.nic.in, hmfw.ap.gov.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచామని ఆమె వివరించారు.
టాపిక్