Best Web Hosting Provider In India 2024
Serial Actor Chandu Suicide: తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. అది జరిగిన వారంలోపలే సీరియల్ నటుడు చందూ (చంద్రకాంత్) ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర మరణాన్ని తట్టుకోలేకే చందూ నేడు (మే 18) ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం బయటికి వచ్చింది. చందూ, పవిత్ర సుమారు మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారని కూడా తెలుస్తోంది. అయితే, చందూకు 2015లోనే శిల్పతో వివాహమైంది. చందూ ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప మీడియాతో మాట్లాడారు.
ఆమె వల్లే మా మధ్య దూరం
చందూ, శిల్పకు సుమారు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. 12ఏళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, పవిత్రతో పరిచయం తర్వాత చందూ తనకు దూరమయ్యాడని ఆయన భార్య శిల్ప నేడు మీడియాతో చెప్పారు. త్రినయని సీరియల్ సమయంలో పవిత్ర జయరాం, చందూ మధ్య పరిచయం పెరిగిందని, అప్పటి నుంచి కలిసే ఉంటున్నారని శిల్ప తెలిపారు. తనతో నాలుగేళ్లుగా చందూ మాట్లాడడం లేదని శిల్ప కన్నీరు పెట్టుకున్నారు. ఏదైనా విషయం ఉంటే పిల్లల ద్వారానే చెప్పిస్తుండేవారమని ఆమె వెల్లడించారు. శిల్ప, చందూకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు
పవిత్రతో చందూ కలిసే ఉన్నా తాను అభ్యంతరం చెప్పలేదని, ఆయన సంతోషమే ముఖ్యం అనుకొని తాను వాదించలేదని శిల్ప చెప్పారు. ఎప్పటికైనా తన వద్దకే చందూ వస్తాడని ఆశతో జీవితం కొనసాగించానని అన్నారు. పవిత్ర మరణించాక చందూ తనకు కాల్ చేశారని, ఇంటికి వచ్చేమని కూడా అడిగానని చెప్పి వెక్కివెక్కి ఏడ్చారు. చందూ ఆత్మహత్య చేసుకుంటానని తాను అసలు అనుకోలేదని శిల్ప అన్నారు. “జరిగిపోయిందేదో జరిగిపోయింది.. ఇక్కడి వచ్చేయ్ అని చందూతో చెప్పా. పిల్లల కోసం నువ్వు ఉండు అని అడిగా. ఆయన కూడా నేనెందుకు చస్తాను.. చావను అని అన్నారు. ఆ మాటలు నాతో చెప్పిన 24 గంటల్లోనే ఇది జరిగింది” అని శిల్ప అన్నారు.
మహబూబ్‍నగర్ జిల్లా భూత్పూర్ సమీపంలో మే 12 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. వారి కారు ఓ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పవిత్ర అక్కడికక్కడే కన్నుమూయగా.. అదే కారులో ఉన్న చందూకు స్పల్ప గాయాలయ్యాయి. పవిత్ర మృతితో చందూ డిప్రెషన్‍లోకి వెళ్లారు. కొన్నిరోజులుగా ఇన్‍స్టాగ్రామ్‍లో పవిత్ర గురించే వరుస పోస్టులు పెడుతున్నారు. అయితే, నేడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
చందూ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పరిధిలోని అల్కాపూర్ కాలనీలో చందూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. త్రినయని, రాధమ్మ కూతురు, కార్తీక దీపం 2 సీరియళ్లతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. చందూ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పవిత్ర జయరాం మృతితో మనోవేదన చెందే చందూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. రెండు రోజుల కిందటే పవిత్ర పుట్టిన రోజు కూడా ఉండడంతో చందూ మరింత కుమిలిపోయారు. వరుసగా ఇన్‍స్టాగ్రామ్ పోస్టులు పెట్టారు చందూ. కొందరు తోటి నటులు కూడా చందూను ఓదార్చారని తెలుస్తోంది. చివరికి చందూ ఆత్మహత్య చేసుకున్నారు.