Best Web Hosting Provider In India 2024
haQuitting Job: చాలామంది తమ చేతుల్లో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మెరుగైన ఉద్యోగం కోసం వెతకాలని ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని వదలడం అనేది అనేక విధాలుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవానికి ముందు మీరు చాలా ఆలోచించాలి. ఆర్థిక పరిస్థితులు, కెరీర్, వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ ఆలోచించుకున్నాకే ఉద్యోగాన్ని విడిచిపెట్టాలి. ముందుగా ఉద్యోగం వెతుక్కోకుండా… చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టడం చాలా ప్రమాదకరమైన నిర్ణయం. మీరు ఒక ఉద్యోగాన్ని వదిలి పెట్టాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల గురించి ముందుగానే ఆలోచించుకోవాలి.
ఆర్థిక స్థితి
మీరు ఒక ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు మీ కుటుంబానికీ, మీకు అయ్యే ఖర్చులు మూడు నుంచి 6 నెలలకు సరిపడా ముందుగానే పొదుపు చేసుకొని ఉంచుకోవాలి. దీన్నే బఫర్ మనీ అంటారు. మీకు సరిపోయే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడు మీ రోజువారీ ఖర్చులు మీపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకూడదు. అందుకోసమే ఇలా కొంత డబ్బును పక్కన పెట్టుకున్నాకే మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగ అన్వేషణ చేయాలి. చేతిలో జాబ్ ఆఫర్ అప్పటికే ఉంటే ధైర్యంగా ముందుకు వెళ్లొచ్చు. కానీ చేతిలో జాబ్ ఆఫర్ లేకుండా ఉన్న ఉద్యోగాన్ని వదిలివేయాలనుకునే వారు మాత్రం ఇలా ఆర్థికంగా ముందుగానే జాగ్రత్తపడాలి.
కెరీర్
మీ ఫీల్డ్ లోని జాబ్ మార్కెట్ ఎలా ఉందో ముందుగానే చూసుకోండి. మీరు ఉన్న అవకాశాన్ని వదులుకుంటే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం మార్కెట్లో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి. అలాగే జీతభత్యాలు ఇక్కడ కన్నా ఎక్కువగా వస్తాయో లేవో అంచనా వేసుకోండి. తొందరపాటుతో ఉన్న ఉద్యోగాన్ని మాత్రం వదులుకోవద్దు. లేకుంటే కెరీర్ లో మీరు మరింత వెనకబడే అవకాశం ఉంది.
వ్యక్తిగత ఆరోగ్యం
ఉద్యోగం వదిలివేయడం అనేది మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. తీవ్ర ఒత్తిడి కూడా మీరు భరించాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఒత్తిడి ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి మీ ఉద్యోగం వదిలే ముందు మీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి మద్దతుతోనే మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగం వెతుకులాటకు వెళ్లడం మంచిది. లేకుంటే ఒంటరిగా మిగిలిపోతారు.
మీరు ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశంలో స్నేహితులు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే జీతం కోసం కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం మంచి పద్ధతి కాదు. మీరు ప్రస్తుతం పని చేస్తున్న ప్రదేశం విషపూరితంగా అనిపిస్తున్నా, మానసికంగా ఒత్తిడికి గురవుతున్నా, అంతర్గత రాజకీయాలు అక్కడ ఎక్కువగా ఉన్నా, మీ కెరీర్ ఎదుగుదల ఇక్కడ ఉండదనీ మీరు భావించినా.. అప్పుడు కొత్త ఉద్యోగానికి ప్లాన్ చేయడం ఉత్తమం ఎంపిక. అలా కాకుండా ప్రస్తుతం చేసిన కంపెనీలో యజమాని, టీం లీడర్లతో సంబంధాలు కలిగి ఉండి కూడా బయటికి వెళ్లాలని మాత్రం అనుకోవద్దు. బయట పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేము.
చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలే ముందు బయట కంపెనీలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ జీతభత్యాలు ఎలా ఇస్తున్నారు? ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? అనే విషయాలను ముందుగా అంచనా వేసుకోండి. ఆయ సంస్థల కన్నా మీ సంస్థ మంచిగా అనిపిస్తే ఉండిపోవడమే ఉత్తమం. లేకుంటే అక్కడికి వెళ్ళాక మరింతగా పరిస్థితుల్లో దిగజారవచ్చు.
టాపిక్